కలం, వెబ్‌డెస్క్: భారత చెస్ ప్లేయర్లు కోనేరు హంపి (Koneru Humpy), అర్జున్ ఇరిగేసి (Arjun Erigaisi) ప్రపంచ వేదికపై మరోసారి ప్రతిభ చాటారు. ఈ తెలుగు గ్రాండ్‌మాస్టర్లు ఫిడే ప్రపంచ ర్యాపిడ్ చెస్ చాంపియన్‌షిప్‌లో పతకాలు సాధించారు. మహిళల విభాగంలో డిపెండింగ్ చాంపియన్, 38 ఏళ్ల కోనేరు హంపి కాంస్యం గెలుచుకున్నారు. మొత్తం 11 రౌండ్లలో 8.5 పాయింట్లు సాధించిన హంపి.. మరో ఇద్దరితో కలసి అగ్రస్థానంలో నిలిచింది. అయితే, టైబ్రేక్ స్కోరులో వెనకబడి మూడో స్థానంలో నిలిచింది. టైటిల్ నిలబెట్టుకోవడానికి పోరాడిన టైబ్రేక్ హంపి ఆశలపై నీళ్లు చల్లింది. అలెగ్జాండ్రా గొర్యాచ్కినా(రష్యా) ప్రథమ, జినెర్(చైనా) ద్వితీయ స్థానంలో నిలిచారు. ఓపెన్ విభాగంలో అర్జున్ అన్ని రౌండ్లూ ముగిసేసరికి 9.5 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచాడు. ప్రపంచ చెస్‌లో అర్జున్‌కు ఇదే తొలి పతకం. పతకాలు గెల్చిన కోనేరు హంపి, అర్జున్ ఇరిగేసిలకు ప్రధాని నరేంద్ర మోదీ, తెలంగాణ, ఏపీ ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి, చంద్రబాబు ‘ఎక్స్’ వేదికగా అభినందనలు తెలిపారు. వారు ప్రదర్శించిన అసాధారణ నైపుణ్యం, పట్టుదల, పోటీతత్వం దేశానికి, తెలుగువారికి గర్వకారణమని పేర్కొన్నారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.


