కలం, వెబ్ డెస్క్ : పద్నాలుగేళ్ల క్రితం సనత్‌నగర్ (Sanathnagar) పరిధిలో జరిగిన ఒక మహిళా హత్య కేసులో కోర్టు అత్యంత కీలకమైన తీర్పు(Court Judgment) ను వెలువరించింది. ఈ కేసులో నేరం రుజువు కావడంతో నిందితుడికి ఉరిశిక్ష విధిస్తూ మేడ్చల్ జిల్లా కోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. 2011 సెప్టెంబర్ 18వ తేదీ రాత్రి భరత్‌నగర్‌లోని ఏసీసీ గోదాం సమీపంలో ఒక మహిళ దారుణ హత్యకు గురైంది. స్థానికంగా తీవ్ర కలకలం రేపిన ఈ ఘటనపై అప్పటి సనత్‌నగర్ (Sanathnagar) పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. వివాహేతర సంబంధం నేపథ్యంలోనే ఈ హత్య జరిగినట్లు పోలీసులు తమ దర్యాప్తులో ప్రాథమికంగా నిర్ధారించారు.
ఈ హత్యకు సంబంధించి కర్ణాటక రాష్ట్రం బీదర్ జిల్లాకు చెందిన కరణ్‌సింగ్ (35)ను పోలీసులు ప్రధాన నిందితుడిగా గుర్తించి అరెస్టు చేశారు. నాటి నుంచి నేటి వరకు సాక్ష్యాధారాల సేకరణ, విచారణ ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగింది. పోలీసులు పక్కా ఆధారాలను కోర్టు ముందు ప్రవేశపెట్టారు. నిందితుడు చేసిన నేరం అత్యంత దారుణమైనదని అభిప్రాయపడుతూ.. కరణ్‌సింగ్‌కు మరణశిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. ఉరిశిక్షతో పాటు నిందితుడికి రూ. 10 వేల జరిమానా కూడా విధించారు.


