epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

750+ క్రెడిట్ స్కోర్‌తో ఎన్ని లాభాలో…

కలం, డెస్క్ : మంచి క్రెడిట్ స్కోర్ (Credit Score) అంటే కేవలం లోన్ లేదా క్రెడిట్ కార్డ్ పొందడానికి మాత్రమే ఉపయోగపడదు. దీంతో చాలా ఉపయోగాలు, లాభాలు ఉన్నాయని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా క్రెడిట్ స్కోర్ 750 దాటిన తర్వాత మీ ఆర్థిక జీవితాన్ని పూర్తిగా మార్చే శక్తి దానికి ఉంటుందని అంటున్నారు. చాలామంది క్రెడిట్ స్కోర్‌ను సమస్య వచ్చినప్పుడు లేదా కొత్తగా అప్పు తీసుకోవాలనుకున్నప్పుడు మాత్రమే చెక్ చేసుకుంటారు. కానీ వాస్తవానికి, మంచి స్కోర్ ఉన్నవారికి బ్యాంకులు స్వయంగా అనేక రకాల ప్రయోజనాలను అందిస్తాయి.

750 ప్లస్ స్కోర్ అంటే ఏమిటి?

క్రెడిట్ స్కోర్ 750 కంటే ఎక్కువగా ఉంటే, మీరు బాధ్యతాయుతంగా అప్పులు తీసుకుంటారని, వాటిని సకాలంలో తిరిగి చెల్లిస్తారని బ్యాంకులకు స్పష్టమైన సంకేతం వెళ్తుంది. ఇలాంటి కస్టమర్లను బ్యాంకులు ‘లో రిస్క్ కస్టమర్లు’గా పరిగణిస్తాయి. డిఫాల్ట్ అయ్యే అవకాశాలు తక్కువగా ఉండటంతో, మీకు మెరుగైన వడ్డీ రేట్లు, ప్రత్యేక ఆఫర్లను అందుబాటులోకి తెస్తాయి. ఒకే ఆదాయం ఉన్న ఇద్దరిలో, అధిక క్రెడిట్ స్కోర్ ఉన్న వ్యక్తికే తక్కువ వడ్డీతో లోన్ లేదా క్రెడిట్ కార్డ్ లభించడం సాధారణం.

వడ్డీ రేట్లలో ఆదా

క్రెడిట్ కార్డులపై సాధారణంగా అధిక వడ్డీ రేట్లు ఉంటాయి. అయితే బలమైన క్రెడిట్ స్కోర్ (Credit Score) ఉన్నవారికి బ్యాంకులు తక్కువ వడ్డీ ఛార్జీలతో కూడిన కార్డులను అందిస్తాయి. ఉదాహరణకు, రూ.1 లక్ష బ్యాలెన్స్‌పై 36 శాతం వడ్డీకి బదులు 30 శాతం వడ్డీ మాత్రమే ఉంటే, ఏడాదికి వేల రూపాయలు ఆదా అవుతాయి. ఈ చిన్న తేడా దీర్ఘకాలంలో భారీ ఆర్థిక ప్రయోజనంగా మారుతుంది.

ప్రీమియం క్రెడిట్ కార్డులు

మంచి స్కోర్ ఉన్నవారికి ‘లైఫ్‌టైమ్ ఫ్రీ’ క్రెడిట్ కార్డులు, వార్షిక ఫీజు లేని లేదా తక్కువ ఫీజుతో కూడిన ప్రీమియం కార్డులు లభిస్తాయి. కొన్ని సందర్భాల్లో వార్షిక ఫీజు ఉన్నా, నిర్దేశించిన ఖర్చు చేస్తే ఆ ఫీజును పూర్తిగా మాఫీ చేసే సదుపాయాలు ఉంటాయి. తక్కువ క్రెడిట్ స్కోర్ ఉన్నవారు మాత్రం అధిక ఛార్జీలున్న ప్రాథమిక కార్డులకే పరిమితమవుతారు.

తక్కువ పెనాల్టీలు

క్రెడిట్ స్కోర్ బాగుంటే బ్యాంకులు ఎక్కువ క్రెడిట్ పరిమితిని ఇస్తాయి. దీని వల్ల క్రెడిట్ వినియోగ నిష్పత్తి తగ్గుతుంది. లిమిట్ ఎక్కువగా ఉండి వినియోగం తక్కువగా ఉంటే, మీ స్కోర్ మరింత మెరుగవుతుంది. అంతేకాకుండా ఆలస్య చెల్లింపుల వల్ల వచ్చే పెనాల్టీలను కూడా సులభంగా తప్పించుకునే అవకాశం ఉంటుంది.

బ్యాంకులతో బేరం

750 పైగా స్కోర్ ఉన్నవారికి బ్యాంకులతో చర్చలు జరిపే బలం లభిస్తుంది. క్రెడిట్ కార్డు వడ్డీ రేటును తగ్గించమని లేదా వార్షిక ఫీజును రద్దు చేయమని కోరవచ్చు. క్రమం తప్పకుండా చెల్లింపులు చేసే కస్టమర్లను కోల్పోకూడదన్న ఉద్దేశంతో బ్యాంకులు ఇలాంటి అభ్యర్థనలను అంగీకరించే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

తక్కువ వడ్డీకే లోన్లు

మంచి క్రెడిట్ స్కోర్ ఉన్నవారికి బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్ ఆఫర్లు, ఇన్‌స్టంట్ లోన్లు తక్కువ వడ్డీ రేట్లకే లభిస్తాయి. దీని ద్వారా పాత అప్పులను సులభంగా తీర్చుకోవచ్చు. అధిక వడ్డీలు చెల్లించే అవసరం ఉండదు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>