కలం, కరీంనగర్ బ్యూరో: తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam) సొంత జిల్లాలో ఆటో కార్మికుల బంద్ విజయవంతమైంది. రాష్ట్రవ్యాప్తంగా ఆటోల బంద్ విరమించుకున్నట్లు మంత్రి ఆదివారం ప్రకటించినప్పటికీ, కరీంనగర్లో(Karimnagar) వివిధ యూనియన్లకు చెందిన ఆటో కార్మికులు స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొన్నారు. దీంతో ఎక్కడికక్కడ ఆటోలు నిలిచిపోవడంతో ప్రయాణికులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. జిల్లాలోని 14 ఆటో స్టాండ్ల పరిధిలోని ఆటోలతో పాటు కరీంనగర్ టౌన్ పరిధిలో సుమారు 4,500 ఆటోలు, చుట్టుపక్కల మండలాల నుంచి వచ్చే మరో 3,000 ఆటోలు కలిపి మొత్తం 7,500 ఆటోలు స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొన్నట్లు కార్మిక సంఘాల నాయకులు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా దాదాపు 14 వేల మంది ఆటో డ్రైవర్లు బంద్‌కు మద్దతు తెలిపారని పేర్కొన్నారు.
చర్చలు సఫలమయ్యాయంటే స్పష్టత ఇవ్వాలి
ఆటో కార్మిక సంక్షేమ సంఘం అధ్యక్షుడు బొమ్మిడి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఆటో సంఘాల బంద్‌ను విచ్ఛిన్నం చేసేందుకు ‘చర్చలు సఫలమయ్యాయి’ అంటూ తప్పుడు ప్రచారం చేస్తోందని ఆరోపించారు. ప్రభుత్వం నిజంగా ఆటో సంఘాలతో చర్చలు జరిపి ఉంటే రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సంఘాల నాయకులతో కలిసి మీడియా ముందుకు వచ్చి ఎందుకు స్పష్టత ఇవ్వలేదని ప్రశ్నించారు.
రాష్ట్రంలోని సుమారు 7.50 లక్షల మంది ఆటో డ్రైవర్ల సమస్యలపై మాట్లాడేందుకు ప్రభుత్వానికి, రవాణా మంత్రికి సమయం లేకపోవడం విచారకరమన్నారు. ఉచిత బస్సు ప్రయాణం కారణంగా నష్టపోతున్న ఆటో డ్రైవర్ల భవిష్యత్తుపై ప్రభుత్వం స్పష్టమైన ప్రత్యామ్నాయ విధానాన్ని ప్రకటించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ‘విభజించు-పాలించు’ వైఖరిని వీడాలని, ఆటో డ్రైవర్ల డిమాండ్లను పరిష్కరించాలనే చిత్తశుద్ధి ఉంటే నిర్దిష్ట కాలపరిమితిలో సమస్యలను పరిష్కరిస్తామని అధికారిక జీవో లేదా పత్రికా ప్రకటన ద్వారా హామీ ఇవ్వాలని కోరారు.
ఆటో డ్రైవర్ల ప్రధాన డిమాండ్లు
ఆటో డ్రైవర్లకు నెలకు రూ.12 వేల ఆర్థిక సాయం అందించాలని, ఆటో కార్మికుల కోసం ప్రత్యేక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని నాయకులు డిమాండ్ చేశారు. ప్రమాద బీమాను వెంటనే అమలు చేయాలని కోరారు. అర్హులైన ఆటో డ్రైవర్లకు ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలని, ర్యాపిడో, ఓలా పేర్లతో నడుస్తున్న టూ-వీలర్ బైక్ ట్యాక్సీలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఆటో ఇన్సూరెన్స్ ప్రీమియం చార్జీలను తగ్గించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి బండారి సంపత్ పటేల్, మానకొండూరు నియోజకవర్గ ఇన్చార్జి అంతగిరి సంపత్, ఉపాధ్యక్షులు కొత్తూరి సత్యనారాయణ, ఇరవేణి కుమార్, కొత్తూరు రఘు, దండు అంజయ్య, కుకట్ల సంపత్, కోశాధికారి చిట్టి మల్ల నాగభూషణం, సహాయ కార్యదర్శులు వడ్లకొండ శ్రీనివాస్ గౌడ్, వాల్క రమేష్, మీర్జా అఫ్జల్ బేగ్, ఇరుకుల్లా మహేష్, మారం సంపత్, మహమ్మద్ యాకూబ్, బిర్లా రాజు, మౌటం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. కార్యవర్గ సభ్యులు కూర్మాచలం వేణుమాధవ్, వీర్ల పరమేష్, బొంగోని శ్రీనివాస్ గౌడ్, కాల్వ మధుబాబు, నగునూరి ఎల్లయ్య, వి పార్క్ అధ్యక్షుడు సజ్జన రమేష్, చిర్ర సంపత్, మహమ్మద్ సలీం, బొగ్గుల మల్లేశం, పెద్దులు నరసింహ నాయక్, నాగుల మహేందర్‌తో పాటు సుమారు 500 మందికి పైగా ఆటో కార్మికులు, నాయకులు పాల్గొన్నారు.

