డిజిటల్ పల్లెలు.. టెక్నాలజీతో మార్పులు!

​కలం, ఖమ్మం బ్యూరో: తెలంగాణ గ్రామీణ పాలనా వ్యవస్థలో అపూర్వమైన సాంకేతిక విప్లవం ఆరంభమైంది. ఊరి సరిహద్దుల నుంచి మొదలుకుని వీధి చివరి వరకు ప్రతి సమాచారాన్ని మునివేళ్లపైకి తెస్తూ డిజిటల్ పల్లెలుగా అవతరిస్తున్నాయి. టెక్నాలజీతో గ్రామీణాభివృద్ధిలో రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ సమూల మార్పులకు శ్రీకారం చుట్టింది. ఈ బృహత్తర కార్యక్రమానికి ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని లక్ష్మీదేవిపల్లి (Laxmidevipalli), హర్యాతండా గ్రామాలు వేదికగా నిలిచాయి.

తొలి దశలో 31 గ్రామాలు..

​రఘునాథపాలెం మండలం హర్యా తండా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ‘లక్ష్మీదేవిపల్లి’ గ్రామ పంచాయతీలను తొలి దశ పైలట్ ప్రాజెక్టులుగా ఎంపిక చేసి ఈ డిజిటల్ యజ్ఞాన్ని ప్రారంభించారు. ఇప్పటికే రెండు గ్రామాల సమగ్ర ప్రొఫైల్‌ను విజయవంతంగా పూర్తి చేసి, అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. ఇటీవల హైదరాబాద్‌లో పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి ఈ డిజిటల్ పోర్టళ్లను ఆవిష్కరించారు.

​’రైజింగ్ తెలంగాణ-2047′ దిశగా పడుతున్న ఈ అడుగులు ఎంతో క్రమబద్ధంగా ముందుకు సాగుతున్నాయి. తొలి దశలో భాగంగా ప్రతి జిల్లా నుంచి ఒక గ్రామం చొప్పున 31 మోడల్ పంచాయతీల వెబ్‌సైట్లను ప్రారంభించారు. త్వరలోనే ప్రతి శాసనసభ నియోజకవర్గంలో ఒక గ్రామానికి ఈ సేవలు విస్తరించనున్నాయి. రాబోయే సెప్టెంబరు నాటికి రాష్ట్రవ్యాప్తంగా 12,760 గ్రామ పంచాయతీలను సంపూర్ణంగా డిజిటల్ పరిధిలోకి తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యం.

మూడు దశల్లో ప్రాజెక్ట్ అమలు..

​ఈ ప్రాజెక్టును మూడు ముఖ్యమైన ప్రాధాన్య దశల్లో అమలు చేస్తున్నారు. మొదటి దశలో గ్రామ సరిహద్దులు, వైశాల్యం, జనాభా, కుటుంబాలు, అక్షరాస్యత, సహజ వనరులతో పాటు రేషన్ కార్డులు, పెన్షనర్లు, మహిళా సంఘాల వివరాలతో డిజిటల్ డేటాబేస్ సిద్ధం చేస్తారు. రెండో దశలో ఈ వివరాలతో స్థానిక ప్రజల అవసరాలకు అనుగుణంగా గ్రామ సమగ్ర అభివృద్ధి ప్రణాళికలను రూపొందిస్తారు. ఇక చివరి దశలో ఆయా ప్రణాళికల అమలు, పనుల పురోగతి, నిధుల వ్యయాన్ని నిరంతరం పర్యవేక్షిస్తూ పాలనలో సంపూర్ణ పారదర్శకతను నెలకొల్పుతారు.

కార్యాలయాలకు వెళ్లకుండానే…

​ఈ డిజిటల్ మార్పులతో గ్రామస్థులు చిన్న అవసరాల కోసం, సర్టిఫికేట్ల కోసం పంచాయతీ కార్యాలయాల చుట్టూ తిరిగే బాధలు తప్పనున్నాయి. ఇళ్ల పన్ను చెల్లింపులు, లే అవుట్ అనుమతులు, కొత్త ట్రేడ్ లైసెన్సులు, జనన-మరణ ధ్రువపత్రాలు, నివాస, ఆదాయ సర్టిఫికేట్లను ఆన్‌లైన్‌లోనే సులభంగా పొందే వీలు కలుగుతుంది. అంతేకాకుండా సర్పంచి, కార్యదర్శి, ఎమ్మెల్యే, ఎంపీల వివరాలతో పాటు తాగునీరు, విద్యుత్, డ్రైనేజీ సమస్యలపై నేరుగా ఆన్‌లైన్ ద్వారా ఫిర్యాదు చేసే సౌకర్యం అందుబాటులోకి వస్తుంది. హై-స్పీడ్ ఆప్టికల్ ఫైబర్ ఇంటర్నెట్ వసతులతో ప్రారంభమవుతున్న ఈ ‘డిజిటల్ పంచాయతీ’ ప్రయాణం, తెలంగాణ పల్లె సీమలను దేశానికే మోడల్ స్మార్ట్ విలేజెస్‌గా తీర్చిదిద్దబోతోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

మూడేళ్ల అవసరాలకు అనుగుణంగా..

లక్ష్మీదేవిపల్లి పంచాయతీ సెక్రటరీ అమ్మా సాంబయ్య మాట్లాడుతూ.. ఈ నెల 21వ తేదీ నుంచి డిజిటల్ గ్రామ పంచాయతీగా రూపాంతరం చెందిందన్నారు. గ్రామానికి సంబంధించిన సమగ్ర సమాచారం వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచామన్నారు. రాబోయే మూడేళ్లలో గ్రామానికి ఎలాంటి అవసరాలు ఉన్నాయో కూడా ఇందులో పొందుపరిచినట్లు జరిగింది.ఈ సమాచారం అంతా సేకరించడానికి నాకు 15 రోజులు పట్టింది. అలాగే వెబ్సైట్ లో అప్ లోడ్ చేయడానికి 3 రోజులు పట్టింది

ప్రజలకు అందుబాటులో..

సమితి సింగారం పంచాయతీ కార్యదర్శి జక్కుల అశోక్ కుమార్ మాట్లాడుతూ.. గ్రామంలో ఎంత మంది జనాభా ఉన్నారు.. వారిలో పురుషులు, స్త్రీలు ఎంత మంది చదువుకున్నవారనే వివరాలతో పాటు ఎంత మంది మహిళా సంఘాల సభ్యులు ఉన్నారనే విషయాలు వెబ్‌సైట్‌లో ఉంటాయన్నారు. పంచాయతీ సంవత్సర ఆదాయం, ప్రభుత్వం నుంచి నిధులు ఎన్ని వచ్చాయి.. ఎంత ఖర్చవుతోందనే సమగ్ర సమాచారాన్ని సేకరించి వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేస్తున్నామనేది తెలుస్తుందన్నారు. ఆగస్టు 31 నాటికి డేటా సేకరించడం పూర్తి కావాలని ప్రభుత్వం టార్గెట్ నిర్ణయించిందన్నారు. సమాచారం ప్రజలకు అందుబాటులో ఉంటుందని.. ఎక్కడి నుంచైనా తమ గ్రామం గురించి తెలుసుకోవచ్చన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>