epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

యమపాశంలా చైనా మాంజా.. ఎన్ని మెడలు తెగాయో తెలుసా?

కలం, డెస్క్ : ప్రతీ సంవత్సరం సంక్రాంతి పండుగకు ముందు పతంగుల సంబురాలుంటాయి. కొందరికి ఇది ఎంజాయ్‌మెంట్ అయితే మరికొందరికి ప్రాణ సంకటం. ఇందుకు కారణంగా పతంగులను ఎగరేయడానికి వాడుతున్న సింథటిక్ చైనా మాంజాయే (Chinese Manja). సాధారణ దారానికి బదులుగా నైలాన్, సింథటిక్, గాజు పొడితో తయారుచేస్తున్నఈ మాంజాపై అటు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్, ఇటు రాష్ట్ర హైకోర్టు, మరోవైపు తెలంగాణ ప్రభుత్వం నిషేధం విధించింది. దాదాపు పదేండ్లవుతున్నా ఇప్పటికీ దీని విక్రయం, వినియోగం ఆగలేదు. రాష్ట్ర ప్రభుత్వ విభాగాలెన్ని ఉన్నా మాంజా వాడకం కొనసాగుతూనే ఉంది. మనుషుల గొంతులు తెగుతూనే ఉన్నాయి. పక్షులు చచ్చిపోతూనే ఉన్నాయి. ప్రభుత్వం సీరియస్‌గా లేదనేది ప్రజల ఆరోపణ. దీనికి బలం చేకూర్చేలా ఎమ్మెల్యే దానం నాగేందర్ సైతం చైనా మాంజాను విక్రయించేవారి వివరాలు అందజేస్తే రూ. 5 వేల బహుమతి ఇస్తామని ప్రకటించాల్సి వచ్చింది.

ఐదేండ్లలో 200 కేసులు నమోదు :

గడచిన ఐదేండ్లలో హైదరాబాద్ నగరంలో చైనా మాంజా కారణంగా అనేక మంది తీవ్రంగా గాయపడ్డారు. ఆస్పత్రుల్లో చేరి చికిత్స అనంతరం కోలుకున్నారు. కానీ గతేడాది కోటేశ్వరరాలు అనే సైనికుడు మాత్రం లంగర్ హౌజ్ దగ్గర బైక్ మీద వెళ్తూ చైనా మాంజా మెడకు తగిలి కోసుకుపోవడంతో మిలిటరీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఐదేండ్ల వ్యవధిలో పదుల సంఖ్యలో గాయపడ్డారు. పోలీసులు దాదాపు 200కు పైగా కేసులు నమోదు చేశారు. సుమారు 150 మందిపై వివిధ సెక్షన్ల కింద చర్యలు తీసుకున్నారు. చైనా మాంజా తయారీ, గోడౌన్లలో స్టాక్ చేయడం, విక్రయించడం, వినియోగించడంపై నిషేధం ఉన్నా పోలీసులు, విజిలెన్స్ సిబ్బంది ముందుగానే అప్రమత్తమై నివారించడంలో విఫలమవుతున్నరనేది ప్రతి ఏటా స్పష్టమవుతున్నది. పతంగుల సీజన్ వచ్చినప్పుడు సోదాలు చేయడమే తప్ప తయారీపై ముందుగానే సమాచారం సేకరించి కట్టడి చేయడంలో ఉదాసీనమనే విమర్శలు వినిపిస్తున్నాయి.

చైనా మాంజా (Chinese Manja) నిషేధం వచ్చి తొమ్మిదేళ్ళయినా.. :

చైనా మాంజా వాడొద్దని ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేసినా యువతలో మార్పు రాకపోవడం గమనార్హం. ఎన్నో అంశాల్లో ఇంటెలిజెన్స్ విభాగం నుంచి ముందుగానే సమాచారం వస్తున్నా చైనా మాంజా విషయంలో మాత్రం సీరియస్‌గా లేరనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖ 2014లోనే చైనా మాంజాపై కఠినంగా వ్యవహరించాలని రాష్ట్రాలు ఆదేశాలు జారీచేసింది. ఆంక్షలు విధించింది. తెలంగాణ ప్రభుత్వం 2016లోనే నిషేధం విధిస్తూ జీవో జారీచేసింది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ 2017లో స్పష్టమైన తీర్పునే ఇచ్చింది. తాజాగా ఈ ఏడాది జనవరిలో జస్టిస్ విజయ్‌సేన్ రెడ్డి ప్రభుత్వానికి సీరియస్‌గానే హెచ్చరికలు చేశారు. పన్నెండేండ్ల క్రితం కేంద్రం అలర్ట్ చేసినా తొమ్మిదేండ్ల క్రితం రాష్ట్రం జీవో జారీచేసినా ఇప్పటికీ చైనా మాంజా తీవ్రత తగ్గలేదు.

ఎమ్మెల్యే బహుమతి ప్రకటన :

చైనా మాంజా తయారీ, విక్రయాలు యధేచ్ఛగా కొనసాగుతుండడంతో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ (Danam Nagender) చొరవ తీసుకుని సమాచారం ఇచ్చినవారికి బహుమతి ఇస్తానని ప్రకటించారు. సమాచారం ఇచ్చినవారి వివరాలను గోప్యంగా ఉంచుతానని, భయపడాల్సిన పనిలేదని కూడా భరోసా ఇచ్చారు. డ్రగ్స్ విషయంలో ప్రభుత్వం చూపుతున్నంత శ్రద్ధ మాంజా విషయంలోనూ ప్రదర్శిస్తే చాలా ప్రయోజనం ఉండేదన్న మాటలు వినిపిస్తున్నాయి. 2023లో 39 కేసుల్ని పోలీసులు నమోదు చేస్తే 2024లో 49 కేసులు, ఈ ఏడాది ఏకంగా 107 కేసుల్ని నమోదు చేశారు. ట్రాఫిక్ కానిస్టేబుళ్ళు శివరాజ్, నిఖిలేష్ మాంజా బారిన పడి గాయాలపాలయ్యారు. పేరుకు చైనా మాంజా అయినా అది ఆ దేశం నుంచి ఇంపోర్ట్ కావడంలేదని, ఇక్కడే తయారవుతుందని హైకోర్టు జడ్జి వ్యాఖ్యానించడం గమనార్హం. తయారీపై టాస్క్ ఫోర్స్ ఆరా తీసి తొలి దశలోనే కట్టడి చేస్తే దుకాణాల్లోకి వచ్చేవే కావనే ప్రశ్నలు సమాధానం లేనివిగానే మిగిలిపోయాయి.

Read Also: రామాయణం, భగవద్గీత చెప్తా.. అన్వేష్ కీలక వ్యాఖ్యలు

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>