కలెక్టర్ ఆదేశాలు బేఖాతరు.. ప్రజావాణికి జిల్లా అధికారుల డుమ్మా

కలం, నిర్మల్ : ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కరించాలనే ఉద్దేశంతో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి (Nirmal Prajavani) కార్యక్రమం క్రమంగా తన ప్రాధాన్యతను కోల్పోతుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లా స్థాయి అధికారులు తప్పనిసరిగా హాజరు కావాల్సిన ప్రజావాణికి కొందరు అధికారులు గైర్హాజరవుతూ తమ స్థానంలో కిందిస్థాయి సిబ్బందిని పంపించడం విమర్శలకు దారితీస్తోంది.

సోమవారం నిర్మల్ జిల్లా సమీకృత కలెక్టరేట్‌ లో నిర్వహించిన ప్రజావాణికి జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా వీడియో కాన్ఫరెన్స్ కారణంగా ఆలస్యంగా హాజరయ్యారు. అయితే కలెక్టర్ రాకముందు ప్రజావాణికి హాజరైన పలువురు జిల్లా అధికారులు ప్రజల సమస్యలపై దృష్టి సారించాల్సి ఉండగా, కొందరు మొబైల్ ఫోన్లలో నిమగ్నమై కనిపించారు. అనంతరం వీడియో కాన్ఫరెన్స్ ముగించుకుని కలెక్టర్ ప్రజావాణికి వచ్చినప్పటికీ పరిస్థితిలో పెద్దగా మార్పు కనిపించకపోవడం చర్చనీయాంశంగా మారింది.

ప్రజావాణిలో కనిపించని రవాణా శాఖ..

ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణికి జిల్లా రవాణా శాఖ అధికారులు హాజరు కాకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లా రవాణా శాఖ అధికారి, ఇద్దరు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు కార్యాలయంలో ఉన్నప్పటికీ ప్రజావాణికి హాజరుకాకుండా కాంట్రాక్ట్ ప్రాతిపదికన పనిచేస్తున్న కిందిస్థాయి ఉద్యోగిని పంపిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం జిల్లా కేంద్రానికి వస్తుండగా, సంబంధిత శాఖకు చెందిన ఉన్నతాధికారులే ప్రజావాణికి దూరంగా ఉంటే సమస్యలు ఎలా పరిష్కారమవుతాయన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. జిల్లా కలెక్టర్ ఆదేశాలు ఉన్నప్పటికీ అధికారులు తమ తీరును మార్చుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>