కలం, ఖమ్మం బ్యూరో: సాగునీటి ప్రాజెక్ట్ పనుల్లో జాప్యం సహించేది లేదని, నాణ్యతా ప్రమాణాలు పాటించాలని పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు (Payam Venkateshwarlu) స్పష్టం చేశారు. సోమవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలో సీతారామ ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న మారేళ్లపాడు ఎత్తిపోతల పథకం పనులను పరిశీలించారు. పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మాట్లాడారు. సీతారామ ప్రాజెక్ట్ ద్వారా ప్రతీ ఎకరానికి సాగునీరు అందించి రైతులను ఆదుకోవడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. మారేళ్లపాడు ఎత్తిపోతల పథకం పనులను నెలాఖరు నాటికి పూర్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ అధికారులు, ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

