మద్యం మత్తులో బైక్‌తో ఢీ.. వృద్ధురాలు మృతి

కలం, జగిత్యాల: మద్యం మత్తులో బైక్ నడుపుతూ వృద్ధురాలిని ఢీకొట్టి ఆమె మృతికి కారణమైన వ్యక్తిని జగిత్యాల రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిని కోర్టులో హాజరుపరిచారు. ఈ ఘటన జగిత్యాల (Jagtial) రూరల్ మండలం తిమ్మాపూర్ (Thimmapur) గ్రామ శివారులో చోటుచేసుకుంది. తిమ్మాపూర్ గ్రామానికి చెందిన వృద్ధురాలు బడుగు దుబ్బరాజు (60) ఆదివారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో పని నిమిత్తం ఇంటి నుంచి బయలుదేరింది. ఉదయం 4.20 గంటల ప్రాంతంలో తిమ్మాపూర్ శివారులోని మోతె బక్కన్న వ్యవసాయ పొలం వద్ద ఆమె అనుమానాస్పద స్థితిలో మృతి చెంది కనిపించింది. సమాచారం అందుకున్న పోలీసులు తొలుత అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

బైక్ ఆధారంగా నిందితుడి గుర్తింపు

జగిత్యాల డీఎస్పీ పురుషోత్తం, రూరల్ సీఐ సుధాకర్, ఎస్సై ఉమాసాగర్ ఆధ్వర్యంలో క్లూస్ టీం సంఘటనా స్థలాన్ని పరిశీలించింది. అక్కడ లభించిన బైక్ విడిభాగాలు, వాహనం నంబర్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో ఇస్లాంపూర్‌కు చెందిన మొహమ్మద్ సమీ ఉద్దీన్ (42)ను ఆదివారం మధ్యాహ్నం జగిత్యాల బీట్ బజార్‌లోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్ సమీపంలో అదుపులోకి తీసుకున్నారు.

మద్యం మత్తులో ఢీకొట్టి పరార్

పోలీసుల విచారణలో సమీ ఉద్దీన్ నేరాన్ని అంగీకరించినట్లు అధికారులు తెలిపారు. ఈ నెల 22న పొలాస గ్రామానికి వెళ్లిన అతడు స్నేహితుడితో కలిసి ఆదివారం తెల్లవారుజామున 3 గంటల వరకు విస్కీ తాగినట్లు విచారణలో వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం పల్సర్ బైక్‌పై జగిత్యాల వైపు వస్తుండగా తిమ్మాపూర్ (Thimmapur) శివారులో నడుచుకుంటూ వెళ్తున్న దుబ్బరాజును వెనుక నుంచి బలంగా ఢీకొట్టినట్లు పేర్కొన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే భయంతో ఆగకుండా మోతె మార్గం మీదుగా అక్కడి నుంచి పరారైనట్లు తెలిపారు.

బ్రీత్ అనలైజర్‌లో అధిక ఆల్కహాల్

నిందితుడిని అదుపులోకి తీసుకున్న అనంతరం నిర్వహించిన బ్రీత్ అనలైజర్ పరీక్షలో 76 mg/100 ml ఆల్కహాల్ ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఇది అనుమతించదగిన పరిమితి కంటే ఎక్కువగా ఉన్నట్లు పేర్కొన్నారు. ప్రమాదానికి ఉపయోగించిన పల్సర్ మోటార్‌సైకిల్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని సోమవారం కోర్టులో హాజరుపరిచారు. పోస్టుమార్టం, క్లూస్ టీం, ఫోరెన్సిక్ నివేదికల ఆధారంగా కేసును మరిన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

Also Read : కాంగ్రెస్ విద్యావిధానాలపై కొప్పుల ఫైర్

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>