కలం, కరీంనగర్ బ్యూరో: ఆయిల్ పామ్ సాగు(Oil Palm Cultivation)తో రైతులు అధిక ఆదాయం పొందే అవకాశం ఉందని, ఇందుర్తి గ్రామ రైతులు (Indurthi Farmers) పెద్ద ఎత్తున ఆయిల్ పామ్ సాగువైపు అడుగులు వేయాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam) పిలుపునిచ్చారు. ఎకరాకు సుమారు రూ.1.50 లక్షల వరకు ఆదాయం పొందే అవకాశం ఉందని తెలిపారు. మంత్రి సూచనకు సానుకూలంగా స్పందించిన ఇందుర్తి రైతులు దాదాపు 100 ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేపట్టేందుకు ముందుకొచ్చారు.
ఈ సందర్భంగా రైతులను మంత్రి అభినందించారు. చిగురుమామిడి మండలం ఇందుర్తి గ్రామంలో సోమవారం ‘పల్లె పల్లెకు పొన్నం అన్న–పల్లె పల్లెలో ప్రజా పాలన’ కార్యక్రమంలో భాగంగా గ్రామ పంచాయతీ వద్ద నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. గ్రామాభివృద్ధి, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, ప్రజల సమస్యలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఆయిల్ పామ్‌తో పాటు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి
ఆయిల్ పామ్‌తో పాటు నువ్వులు, వేరుశనగ, ఆముదం తదితర పంటల సాగుపై కూడా రైతులు దృష్టి సారించాలని మంత్రి (Minister Ponnam) సూచించారు. వ్యవసాయంలో పంటల వైవిధ్యాన్ని పెంచుకుని అధిక ఆదాయం సాధించే దిశగా రైతులు ముందుకు సాగాలని కోరారు. గ్రామంలోని ప్రతి ఇంటికి సోలార్ విద్యుత్ ఏర్పాటు చేసుకునేలా ప్రజలు ముందుకు రావాలని పొన్నం ప్రభాకర్ సూచించారు. సౌర విద్యుత్‌ను వినియోగించడం ద్వారా విద్యుత్ ఖర్చులను తగ్గించుకోవడంతో పాటు ప్రభుత్వం అందించే సబ్సిడీలను సద్వినియోగం చేసుకోవచ్చని తెలిపారు. రైతులు, గ్రామ ప్రజలు పునరుత్పాదక ఇంధన వనరుల వినియోగంపై దృష్టి పెట్టాలని పిలుపునిచ్చారు.
ఇందుర్తి అభివృద్ధే లక్ష్యం
ఇందుర్తి గ్రామ అభివృద్ధికి ప్రత్యేక చొరవ తీసుకుంటానని మంత్రి తెలిపారు. గ్రామంలో నెలకొన్న సమస్యలను అధికారుల సమన్వయంతో పరిష్కరించేందుకు ‘పల్లె పల్లెకు పొన్నం అన్న’ కార్యక్రమాన్ని చేపట్టినట్లు పేర్కొన్నారు. గ్రామాల అభివృద్ధి నిరంతర ప్రక్రియ అని, ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు, సంక్షేమ పథకాలు అందేలా ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ
ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని మంత్రి సూచించారు. వ్యాధుల బారిన పడకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, ఆరోగ్యమే మహాభాగ్యమని పేర్కొన్నారు. విద్య, వైద్య రంగాలకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని, ప్రజలు అందుబాటులో ఉన్న ప్రభుత్వ వైద్య సేవలను వినియోగించుకోవాలని కోరారు. ఈ సందర్భంగా గ్రామస్తులు తమ వ్యక్తిగత, సామాజిక సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువచ్చారు.
ఇందుర్తి గ్రామ ప్రగతి
గ్రామంలో 32 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాగా, రెండో దశలో మరిన్ని ఇళ్లు మంజూరు కానున్నాయి. మహాలక్ష్మి పథకం కింద 673 మంది లబ్ధిదారులకు గ్యాస్ సబ్సిడీ అందుతోంది. 91 స్వశక్తి సంఘాల మహిళలకు రూ.32.61 లక్షల వడ్డీలేని రుణాలు, శ్రీనిధి కింద 11 సంఘాలకు రూ.40 లక్షలు అందించారు. 1,431 మందికి ఇందిరమ్మ చీరలు పంపిణీ చేశారు. గృహజ్యోతి పథకం కింద 793 కుటుంబాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందుతోంది. రైతుభరోసా కింద 1,249 మంది రైతులకు రూ.8.06 కోట్లు విడుదల కాగా, 532 మంది రైతులకు రైతు రుణమాఫీ కింద రూ.4.38 కోట్ల ప్రయోజనం చేకూరింది. రైతుబీమా కింద ఆరుగురికి రూ.30 లక్షలు అందించారు.
గ్రామంలో 862 పింఛన్లు ఉండగా, ప్రతి నెల రూ.19.61 లక్షలు పంపిణీ చేస్తున్నారు. 1,126 రేషన్ కార్డులు ఉండగా, ప్రజా ప్రభుత్వంలో సన్నబియ్యం పంపిణీ చేస్తున్నారు. కొత్తగా 175 రేషన్ కార్డులు మంజూరు చేశారు. కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల కింద 66 మంది లబ్ధిదారులకు రూ.66.06 లక్షలు అందించారు. అర్హులైన లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు.
Also Read : మంత్రి కొండా సురేఖకు భారీ షాక్
Follow Us On: X(Twitter)

