కలం, స్పోర్ట్స్ : కొలంబో టెస్టులో టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ (Rishabh Pant) మరో అరుదైన రికార్డు సృష్టించాడు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్‌గా నిలిచాడు. శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టు రెండో రోజు లంచ్ సమయానికి పంత్ 63 పరుగులతో నాటౌట్‌గా ఉన్నాడు. భారత్ 6 వికెట్లకు 419 పరుగులు చేసింది. పంత్ 42 టెస్టులలో 2,948 పరుగులు సాధించాడు. ఇప్పటివరకు ఈ రికార్డు టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ పేరిట ఉంది. గిల్ 42 టెస్టులలో 2,917 పరుగులు చేశాడు. భారత బ్యాటర్లలో రోహిత్ శర్మ 2,716 పరుగులతో మూడో స్థానంలో ఉండగా.. రవీంద్ర జడేజా 2,675, విరాట్ కోహ్లీ 2,617 పరుగులతో తర్వాతి స్థానాలలో ఉన్నారు.
ధోనీ రికార్డును కూడా బద్దలు కొట్టిన పంత్
ఇదే ఇన్నింగ్స్‌లో పంత్ (Rishabh Pant) మరో ఘనత సాధించాడు. విదేశీ లేదా తటస్థ వేదికలలో వికెట్ కీపర్‌గా అత్యధిక టెస్టు పరుగులు చేసిన భారత ఆటగాడిగా నిలిచాడు. ఈ క్రమంలో 2,500 పరుగుల మార్క్‌ను దాటిన పంత్.. ఎంఎస్ ధోనీ 2,496 పరుగుల రికార్డును అధిగమించాడు.
జూరెల్‌తో శతక భాగస్వామ్యం
పంత్‌కు యువ వికెట్ కీపర్ బ్యాటర్ ధ్రువ్ జూరెల్ అండగా నిలిచాడు. జూరెల్ కూడా అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. ఇద్దరూ కలిసి ఏడో వికెట్‌కు లంచ్ సమయానికి 112 పరుగుల అజేయ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. దీంతో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 400 పరుగుల మార్క్‌ను దాటింది. టెస్టు తొలి రోజు పంత్ గాయం ఆందోళనకు గురిచేసింది. లహిరు కుమార వేసిన షార్ట్ బాల్ అతడి ఎడమ చేతికి బలంగా తగిలింది. ఆ సమయానికి పంత్ మూడు పరుగులే చేసి ఉండటంతో రిటైర్డ్ హర్ట్‌గా మైదానం వీడాడు. అయితే రెండో రోజు తిరిగి బ్యాటింగ్‌కు వచ్చిన పంత్ అద్భుతంగా ఆడుతూ జూరెల్‌తో కలిసి భారత్‌ను బలమైన స్థితిలో నిలిపాడు.
కొలంబోలో భారత్‌కు మరో రికార్డు
కొలంబోలో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 400కు పైగా పరుగులు చేసిన జట్లలో భారత్ 11వ జట్టుగా నిలిచింది. ఇంతకుముందు 10 సందర్భాల్లో ఆరు విజయాలు, నాలుగు డ్రాలు నమోదయ్యాయి. శ్రీలంకలో ఏడో వికెట్ లేదా అంతకంటే దిగువన భారత్‌కు 100కు పైగా భాగస్వామ్యం రావడం ఇది రెండోసారి. 2015లో ఇదే వేదికపై చతేశ్వర్ పుజారా, అమిత్ మిశ్రా కలిసి 104 పరుగులు జోడించారు.
Also Read : బోల్ట్ రికార్డును బద్దలు కొట్టిన రోబోట్..
Follow Us On: X(Twitter)

