ఒక్కరోజే లక్ష మొక్కలు.. ఖమ్మంలో రేపు భారీ గ్రీన్ డ్రైవ్!

కలం, ఖమ్మం బ్యూరో: రాష్ట్ర వ్యాప్తంగా పర్యావరణ పరిరక్షణను ఒక సామాజిక బాధ్యతగా ముందుకు తీసుకెళ్లేందుకు చేపట్టిన వనమహోత్సవ (Vanamahotsavam) కార్యక్రమంలో ఖమ్మం (Khammam) జిల్లా విశేష ప్రగతిని కనబరిచింది. ప్రస్తుత సంవత్సరానికి గాను జిల్లాలో నాటాల్సిన 31.30 లక్షల మొక్కల లక్ష్యానికి గాను ఇప్పటికే 20.90 లక్షల మొక్కలను నాటి, 67 శాతం ప్రగతితో రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలిచింది.

ఇదే ఉత్సాహంతో మంగళవారం జిల్లా వ్యాప్తంగా ఒకే రోజు లక్ష మొక్కలు నాటేలా మరో భారీ సామూహిక మొక్కల పెంపకం డ్రైవ్‌కు జిల్లా యంత్రాంగం రంగం సిద్ధం చేసింది. ​రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ సోమవారం అన్ని జిల్లాల కలెక్టర్లు, డిఎఫ్ఓలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఖమ్మం జిల్లా ప్రగతిని కలెక్టర్ దివాకర టీఎస్ వివరించారు.

మంగళవారం నాటి భారీ కార్యక్రమం కోసం ఇప్పటికే 2 లక్షలకు పైగా గుంతలను ముందస్తుగా సిద్ధం చేసినట్లు తెలిపారు. ఖమ్మం పట్టణంలో జరిగే ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని మొక్కలు నాటనున్నారు.

​ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ (Konda Surekha) మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా నిర్దేశించిన 16.06 కోట్ల మొక్కల లక్ష్యానికి గాను ఇప్పటివరకు 9.06 కోట్ల మొక్కలు నాటినట్లు తెలిపారు. మేడ్చల్ (9%), హెచ్‌ఎండీఏ, సూర్యాపేట, సంగారెడ్డి వంటి 50 శాతం కంటే తక్కువ ప్రగతి నమోదు చేసిన ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించి లక్ష్యాలను వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు.

నాటిన ప్రతి మొక్కకూ తప్పనిసరిగా జియో ట్యాగింగ్ చేయాలని, చనిపోయిన మొక్కల స్థానంలో వెంటనే కొత్తవి నాటుతూ నిరంతరం పర్యవేక్షించాలని స్పష్టం చేశారు. రానున్న వర్షాలను అనుకూలంగా మార్చుకుని సెప్టెంబర్ చివరి నాటికి అన్ని లక్ష్యాలనూ పూర్తి చేయాలని సూచించారు.

ఈ డ్రైవ్‌లో ప్రజాప్రతినిధులు, NSS, NCC విద్యార్థులు, స్వయం సహాయక సంఘాల మహిళలు, అంగన్వాడీ సిబ్బందితో పాటు ప్రజలందరినీ భాగస్వాములను చేస్తూ మండల, గ్రామ స్థాయిల్లో ముమ్మరంగా నిర్వహించాలని కలెక్టర్ దివాకర టీఎస్ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో అడిషనల్ డీఆర్‌డీఓ బి. శిరీష, డీఎఫ్‌ఓ అనూజ్ అగర్వాల్ తదితర అధికారులు పాల్గొన్నారు.

Also Read : బీజేపీ ఎంపీపై నిరంతర నిఘా.. సంచలన ఆరోపణలు

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>