కలం, వెబ్ డెస్క్: కాంగ్రెస్ ప్రభుత్వం 22ఏ నిషేధిత భూముల విషయంలో పెద్ద కుట్రకు పాల్పడుతోందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) ఆరోపించారు. ఎలాంటి తప్పు చేయకపోతే.. భూ భారతి పోర్టల్ రాత్రికి రాత్రే ఎందుకు మాయం చేశారని సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ నగరంలోని భూముల వివరాలను కనిపించకుండా భూ భారతి పోర్టల్లో చూపించడం లేదన్నారు.
దీనిపై ప్రజల్లో పెద్ద ఎత్తున అనుమానాలు నెలకొన్నాయని స్పష్టం చేశారు. ప్రభుత్వ భూములను కొట్టేసేందుకు ఇలా చేస్తున్నారా.. అని హరీశ్ ప్రశ్నించారు. యాదాద్రి జిల్లాలో 40 వేల ఎకరాలు నిషేధిత జాబితాలో పెట్టారని మంత్రి కోమటిరెడ్డి సీఎంకు చెప్పారని హరీశ్ వివరించారు. స్వయానా మంత్రి చెప్పినా సీఎం ఎందుకు చర్యలు తీసుకోలేదన్నారు. నిషేధిత భూముల విషయంలో ఏ1 రేవంత్ రెడ్డి, ఏ2 పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అని ఎద్దేవా చేశారు.
అసెంబ్లీని స్తంభింపజేస్తాం…
నిషేధిత భూముల సమస్యలను పరిష్కరించకపోతే సెప్టెంబర్ మొదటి వారంలో జరిగే అసెంబ్లీని స్తంభింపజేస్తామని హరీశ్ రావు హెచ్చరించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయకపోతే బీఆర్ఎస్ పార్టీ సత్తా ఏంటో చూపిస్తామన్నారు. ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి.. బాధితులకు న్యాయం జరిగేలా చేస్తామన్నారు. అధికారుల పేరు చెప్పి సీఎం రేవంత్ రెడ్డి తప్పించుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. తెలంగాణలో 40 లక్షల ఎకరాలను నిషేధిత జాబితాలో పెట్టే ధైర్యం ఏ అధికారికి ఉంటుందని హరీశ్ ప్రశ్నించారు.

