కలం, వెబ్ డెస్క్: తెలంగాణలో రాష్ట్ర ఆటో కార్మిక సంఘాలతో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) చర్చలు సఫలం అయ్యాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆదివారం రాత్రి నుంచి తలపెట్టిన ఆటోల సమ్మెను విరమించుకున్నట్లు ఆటో కార్మిక సంఘాల జేఏసీ నేతలు ప్రకటించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ.. ఆటో కార్మిక సంఘాల డిమాండ్ల పట్ల ప్రభుత్వం సానుకూలంగా ఉన్నట్లు తెలిపారు.
ఆటో కార్మిక సంఘాల (Auto Workers) నిరవధిక బంద్ విరమించుకోవాలన్న ప్రభుత్వ విజ్ఞప్తికి స్పందించి సమ్మె విరమించిన ఆటో కార్మిక సంఘాలకు ధన్యవాదాలు తెలిపారు. ఆర్టీసీ పక్షాన ఈవీ ఆటోలు కొనే ప్రసక్తే లేదని.. ఆది దుష్ప్రచారం మాత్రమేనని కొట్టిపారేశారు. ఆర్టీసీ కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటుకు ప్రభుత్వం అంగీకరించిందని స్పష్టం చేశారు. విధివిధానాలకు సెప్టెంబర్ 1వ తేదీ కార్మిక శాఖ, రవాణా శాఖ, ఆటో కార్మిక సంఘాల ప్రతినిధులతో సంయుక్త సమావేశం ఉంటుందన్నారు.
2012 తర్వాత ఆటో చార్జీలు పెంచలేదు కాబట్టి.. ఆటో చార్జీలు పెంచడానికి అంగీకరిస్తూ ఎంత పెంచాలి? అనే దానిపైతగిన నివేదిక తీసుకొని సంబంధిత జీవో విడుదల చేయడానికి అంగీకరించినట్లు తెలిపారు. ఓలా, ఉబెర్ మాదిరి ప్రభుత్వం తరుపున యాప్ చేయాలని నిర్ణయించామని.. ప్రభుత్వం ఐటీ శాఖ నుండి యాప్ ప్రారంభించేందుకు తగిన ప్రక్రియ ప్రారంభిస్తామని ప్రకటించారు.

