తమ్ముడు ఎంపీ అరవింద్‌పై అన్న ధర్మపురి సంజయ్ ఫైర్

కలం, నిజామాబాద్ బ్యూరో: నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్‌పై ఆయన అన్న, మాజీ మేయర్ ధర్మపురి సంజయ్ (Dharmapuri Sanjay) ఫైర్ అయ్యారు. తెలంగాణ సమాజం మెచ్చిన నాయకుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఎంపీ అరవింద్ ధర్మపురి చేసిన అనుచిత, అహంకారపూరిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు. ప్రజాస్వామ్యంలో విమర్శలు రాజకీయంగా, విధానపరంగా ఉండాలి కానీ, ఇలా ఒక ముఖ్యమంత్రి శరీర ఆకృతిని కించపరుస్తూ మాట్లాడటం, వ్యక్తిగత దూషణలకు దిగజారడమనేది అరవింద్ దిగజారుడు రాజకీయాలకు పరాకాష్ట అని విమర్శించారు.

‘ఎంపీ అరవింద్‌ ను సూటిగా అడుగుతున్నా. నా ప్రశ్నలకు సమాధానం చెప్పే దమ్ము ఉందా అని అడుగుతున్నా’ అంటూ సంజయ్ సవాల్ విసిరారు. ‘సంస్కారం లేని రాజకీయం, ఎంపీ పదవిలో ఉన్న వ్యక్తి మాట్లాడాల్సిన భాష ఇదేనా? మీ పార్టీ నేతలైనా మీ భాషను సమర్థిస్తారా? నీతులు చెప్పడం, నికృష్ట రాజకీయాలు చేయడమే మీ సిద్ధాంతమా? అయినా మీ వ్యవహారమంతా వాషింగ్ పౌడర్ సిద్ధాంతమేగా’ అంటూ విమర్శించారు.

బాడీ షేమింగ్ తగదు..

రాజకీయం చేతకాక వ్యక్తిగత, శారీరక ఆకృతిపై మాట్లాడటం తమ సంస్కారహీనతను చూపిస్తోందని ధర్మపురి సంజయ్ మండిపడ్డారు. “ఇదేనా మీకు హైందవ ధర్మం నేర్పేది. మీలాంటి వాళ్ళ వాళ్లనే, దేశం చులకన అవుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజల గుండెల్లో ఉన్న నాయకుడు.. ప్రజాబలంతో గెలిచిన నేత. మీలాంటి వారి అడ్డగోలు మాటలతో ఆయన ప్రతిష్ట తగ్గదు. జన బలం లేని మీ మాటల్ని ప్రజలు ఏ మాత్రం సమర్థించరు’ అని విమర్శించారు.

బీజేపీకి భయం పట్టుకుంది..

తెలంగాణలో కాంగ్రెస్ ప్రజా రంజక పాలన చూసి బీజేపీకి ఓటమి భయం పట్టుకుందని ధర్మపురి సంజయ్ విమర్శించారు. అందుకే వాళ్లకు పిచ్చిముదిరి, పిచ్చి కుక్కల్ల మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజామాబాద్ అభివృద్ధి వదిలేసి, ప్రజలను అడుగడుగునా మోసం చేసిన చరిత్ర తమది అంటూ దుయ్యబట్టారు.

భాష మార్చుకోకపోతే ఊరుకోం..

ఇకనైనా ముఖ్యమంత్రిపై నోరు పారేసుకోవడం మానుకోకపోతే కాంగ్రెస్ శ్రేణులు తగిన బుద్ధి చెబుతాయని ధర్మపురి సంజయ్ హెచ్చరించారు. తెలంగాణ సంస్కృతిలో ఇటువంటి వ్యక్తిగత దూషణలకు తావులేదని.. ధర్మపురి అరవింద్ తక్షణమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, తెలంగాణ ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేదంటే సభ్య సమాజం క్షమించదని గుర్తు చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>