ఏసీబీ దాడులు.. లెక్క చేయని అధికారులు

కలం, నిర్మల్: ప్రభుత్వ కార్యాలయాల్లో పని జరగాలంటే లంచం ఇవ్వాల్సిందేనా.. అనే ప్రశ్న ప్రజల్లో వ్యక్తమవుతోంది. ఇటీవల కాలంలో ఆదిలాబాద్ జిల్లాలో ఏసీబీ (Adilabad ACB) అధికారులు దాడులు నిర్వహించి అవినీతి అధికారులను పట్టుకుంటున్నా, ఏమాత్రం మార్పు కనిపించడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఉచితంగా, నిబంధనల ప్రకారం అందాల్సిన ప్రభుత్వ సేవలకు వెల కట్టి మరీ కొందరు అధికారులు, సిబ్బంది లంచం డిమాండ్ చేస్తుండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

ఏటా పెరుగుతున్న కేసులు..

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఏసీబీకి పట్టుబడుతున్న అధికారుల సంఖ్య ప్రతి ఏడాది పెరుగుతున్నాయి. 2023లో 9 మంది, 2024లో 12 మంది, 2025లో ఏకంగా 24 మంది, 2026లో ఇప్పటివరకు ఏడుగురు అధికారులు లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. ప్రతి ఏడాది సంఖ్య పెరుగుతుండటంతో ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి వ్యవహారాలపై చర్చకు దారి తీస్తోంది. లంచం తీసుకోవడం చట్టరీత్యా నేరమని తెలిసినా కొందరు అధికారులు, సిబ్బంది తమ పద్ధతిని మార్చుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఫైల్ కదలాలన్నా, సర్టిఫికేట్ ఇవ్వాలన్నా, భవనం నిర్మాణానికి అనుమతి పొందాలన్నా.. ఇలా ఏదీ కావాలన్నా అడిగినంత ముట్టజెప్పాల్సి వస్తోందని ప్రజలు ఆవేదన చెందుతున్నారు.

ప్రజల్లో పెరిగిన అవగాహన..

గతంలో లంచం అడిగితే.. బయటకు చెప్పేందుకు వెనుకాడిన ప్రజల్లో ప్రస్తుతం అవగాహన పెరుగుతోంది. లంచం డిమాండ్ చేసినప్పుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించి ఫిర్యాదు చేసేందుకు పలువురు ముందుకు వస్తున్నారు. ఏసీబీ దాడులు, అరెస్టులు కొనసాగుతున్నా లంచాలు తీసుకోవడానికి వెనకాడడం లేదు. అవినీతిని పూర్తిస్థాయిలో అడ్డుకట్ట పడాలంటే పట్టుబడిన అధికారులపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అప్పుడే డబ్బులు అడిగేందుకు వెనుకాడుతారని చెబుతున్నారు. అలాగే, ప్రభుత్వ కార్యాలయాల్లో పారదర్శకత పెంచుతూనే ప్రజలకు తమ హక్కులు, ఫిర్యాదు చేసే విధానంపై మరింత అవగాహన కల్పించాలని కోరుతున్నారు.

ఇటీవల జరిగిన ఘటనలు..

– ఆదిలాబాద్ జిల్లా బోథ్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ప్రణయ్, జూనియర్ అసిస్టెంట్ పరశురాం రూ.15 లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు.

– నిర్మల్ రూరల్ మండల తహసీల్దార్ కార్యాలయ సర్వేయర్ బాలకృష్ణ, అతని ప్రైవేటు అసిస్టెంట్ నాగరాజును ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.
భూమి సర్వే చేసేందుకు రైతు నుంచి రూ.15 వేల లంచం డిమాండ్ చేసి రూ.5 వేలు తీసుకుంటుండగా పట్టుకున్నారు.

– ఎస్సై టి.అశోక్ రూ.20 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు దొరికిపోయారు.

లంచం అడిగితే ఫిర్యాదు చేయండి: జి.మధు, ఏసీబీ డీఎస్పీ

ప్రభుత్వ అధికారులు లంచం అడిగితే బాధితులు ఎలాంటి భయాందోళనకు గురికాకుండా ధైర్యంగా ఏసీబీకి ఫిర్యాదు చేయాలని ఆదిలాబాద్‌ రేంజ్‌ డీఎస్పీ జి.మధు సూచించారు. లంచం తీసుకోవడమే కాకుండా ఇవ్వడం కూడా చట్టరీత్యా నేరమని స్పష్టం చేశారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు చేయించుకునేందుకు అధికారులు లంచం కోసం వేధిస్తే ఏసీబీని సంప్రదించాలని తెలిపారు. ఫిర్యాదుల కోసం ఏసీబీ డీఎస్పీ నంబర్‌ 9154388963, టోల్‌ ఫ్రీ నంబర్‌ 1064కు ఫోన్‌ చేయవచ్చన్నారు. ఏసీబీ హెల్ప్‌లైన్‌ వాట్సాప్‌ నంబర్‌ 9440446106 ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చని డీఎస్పీ తెలిపారు. లంచం డిమాండ్‌ చేసే అధికారులపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>