కలం, ఖమ్మం బ్యూరో: గ్రామ పంచాయతీల స్వయం ప్రతిపత్తి కాపాడి, సర్పంచుల రాజ్యాంగబద్ధమైన హక్కులను తక్షణమే పునరుద్ధరించాలని పంచాయతీరాజ్ ఛాంబర్స్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు పూసలూరి నరేందర్ (Pusaluri Narender) రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. పోరాట కార్యాచరణను రూపొందించేందుకు ఈ నెల 25న ఖమ్మంలోని లకారం ట్యాంక్ బండ్ లేక్ వ్యూ క్లబ్లో ఖమ్మం జిల్లా సర్పంచుల చైతన్య సదస్సును నిర్వహిస్తున్నామని తెలిపారు. ఆదివారం ఖమ్మం ప్రెస్ క్లబ్లో మాట్లాడారు.
నిధులు ఇస్తేనే…
79 ఏళ్ల స్వాతంత్య్ర భారతంలో స్థానిక సంస్థల పాలన రోజురోజుకు దిగజారడంపై నరేందర్ ఆందోళన వ్యక్తం చేశారు. మహాత్మా గాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం సిద్ధాంతం నెరవేరాలంటే గ్రామాల అభివృద్ధికి నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. సర్పంచి, కార్యదర్శులకు చెక్ పవర్ పునరుద్ధరించాలని, 73, 74 రాజ్యాంగ సవరణల ప్రకారం 243G ఆర్టికల్లోని 29 అంశాలను పంచాయతీలకు బదిలీ చేయాలని కోరారు.
బడ్జెట్లో 50 శాతం నిధులతో పాటు రిజిస్ట్రేషన్లు, మైనింగ్, రాయల్టీ రూపంలో రావాల్సిన బాకీలను వెంటనే విడుదల చేయాలన్నారు. సర్పంచులకు నెలకు రూ.30 వేలు గౌరవ వేతనం చెల్లించాలని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో జడ్పీటీసీల సంఘం రాష్ట్ర మాజీ అధ్యక్షులు బెల్లం శ్రీనివాస్, ఎంపీపీల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు లోడిగా వెంకన్న యాదవ్ పాల్గొన్నారు.

