భద్రాచలంలో కొత్త వంతెనపై మళ్లీ రాకపోకలు

కలం, ఖమ్మం బ్యూరో: ​భద్రాచలం (Bhadrachalam) రామయ్య దర్శనార్థం వచ్చే లక్షలాది మంది భక్తులకు, నాలుగు రాష్ట్రాల ప్రయాణికులకు తీపి కబురు అందింది. కొన్ని రోజులుగా ట్రాఫిక్ పద్మవ్యూహంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులకు ఉపశమనం లభించింది. సారపాక వైపు అప్రోచ్ రోడ్డు కుంగిపోవడంతో మూతపడిన భద్రాచలం గోదావరి కొత్త వంతెనపై ఆదివారం నుంచి రాకపోకలు మళ్లీ ప్రారంభమయ్యాయి. కాంక్రీట్ రిటైనింగ్ వాల్ (రక్షణ గోడ) నిర్మాణం, రోడ్డు మరమ్మతులు పూర్తి చేయడంతో వంతెన మళ్లీ రాకపోకలకు సిద్ధమైంది.

అప్రోచ్ రోడ్డు కుంగిపోవడంతో..

​మే 7వ తేదీన రాత్రి సారపాక వైపు ఉన్న అప్రోచ్ రోడ్డు మట్టి ఒక్కసారిగా లోపలికి కుంగిపోయింది. దీంతో భద్రతా కారణాల దృష్ట్యా ఆర్ అండ్ బి అధికారులు ఈ కొత్త బ్రిడ్జిని మూసివేశారు. వర్షాలకు మట్టి దిగజారి ప్రమాదాలు జరగకుండా రాకపోకలను పాత వంతెన వైపు మళ్లించారు. దీంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాలను కలిపే ఈ ప్రధాన జాతీయ రహదారి (NH 30)పై విపరీతమైన రద్దీ పెరిగింది. ఈ పాత వంతెనను 1965 జులై 13న అప్పటి భారత రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ప్రారంభించారు. ఆరు దశాబ్దాల ఈ బ్రిడ్జిపై వాహనాల భారం ఒక్కసారిగా పెరిగి గంటల తరబడి నిలిచిపోవడంతో భక్తులు, ప్రయాణికులు నరకయాతన అనుభవించారు.

రూ.98 కోట్లతో నిర్మాణం..

​పరిస్థితి తీవ్రతను గుర్తించిన అధికారులు కాంక్రీట్ రక్షణ గోడను నిర్మించి అప్రోచ్ రోడ్డును పటిష్టంగా పునర్నిర్మించారు. పనులు పూర్తయి సురక్షితమని నిర్ధారించుకున్నాకే రాకపోకలను పునఃప్రారంభించారు. రూ.98.45 కోట్ల వ్యయంతో 2.3 కిలోమీటర్ల పొడవునా నిర్మించిన ఈ రెండో హైలెవల్ వారధి మళ్లీ అందుబాటులోకి రావడంతో పాత వంతెనపై ఒత్తిడి తగ్గడమే కాకుండా, భద్రాద్రి క్షేత్రానికి వచ్చే భక్తుల ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం లభించినట్లయింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>