కొత్తగూడెంలో పాస్‌పోర్ట్ కేంద్రం ఏర్పాటు: ఎమ్మెల్యే కూనంనేని

కలం, ఖమ్మం బ్యూరో: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వాసుల సుదీర్ఘ నిరీక్షణకు త్వరలోనే తెరపడనుంది. పాస్‌పోర్ట్ సేవల కోసం పొరుగునే ఖమ్మం, మహబూబాబాద్‌ జిల్లాలకు వెళ్లే ప్రయాసలకు తెరపడనుంది. త్వరలోనే కొత్తగూడెం (Kothagudem) పట్టణంలోనే పాస్‌పోర్ట్ సేవలు అందుబాటులోకి రానున్నాయని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఆదివారం వెల్లడించారు. స్థానిక హెడ్ పోస్టాఫీసులో ‘పోస్ట్ ఆఫీస్ పాస్‌పోర్ట్ సేవా కేంద్రం’ ఏర్పాటుకు చర్యలు చేపట్టినట్లు వివరించారు.

​కొత్తగూడెం పట్టణంలోనే పాస్‌పోర్ట్ సేవా కేంద్రాన్ని మంజూరు చేయాలని కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ప్రాంతీయ పాస్‌పోర్ట్ కార్యాలయానికి వినతిపత్రాలు సమర్పించినట్లు ఎమ్మెల్యే కూనంనేని గుర్తు చేశారు. నిరంతర సంప్రదింపుల కారణంగా హైదరాబాద్ ప్రాంతీయ పాస్‌పోర్ట్ అధికారి ఆమోదంతో కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలోని పీఎస్‌పీ (PSP) డివిజన్ అండర్ సెక్రటరీ ప్రతిపాదనలు పంపించినట్లు వివరించారు.

75 కిలోమీటర్ల ప్రయాణం..

సింగరేణి గనులు, ప్రసిద్ధ పరిశ్రమలు, వాణిజ్య కార్యకలాపాలకు నిలయమైన కొత్తగూడెం నుంచి విదేశీ విద్య, ఉద్యోగ అవకాశాల కోసం వెళ్లే యువత, విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరుగుతోందని ఎమ్మెల్యే కూనంనేని వివరించారు. పాస్‌పోర్ట్ కేంద్రం లేకపోవడంతో 75 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఖమ్మం లేదా మహబూబాబాద్ కేంద్రాలకు వెళ్లాల్సి వస్తోందన్నారు. వృద్ధులు, మహిళలు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడటమే కాకుండా సమయం, ప్రయాణ ఖర్చులు వృథా అవుతున్నాయని తెలిపారు.

​జిల్లాల పునర్వ్యవస్థీకరణ తరువాత కొత్తగూడెం జిల్లా కేంద్రంగా ఆవిర్భవించినందున, ఇక్కడే పూర్తిస్థాయి సేవా కేంద్రం ఏర్పాటు కావాల్సిన ఆవశ్యకతను విదేశీ మంత్రిత్వ శాఖ దృష్టికి తీసుకెళ్లి అనుమతులు సాధించేందుకు చొరవ తీసుకున్నట్లు కూనంనేని పేర్కొన్నారు. త్వరలోనే కేంద్ర ప్రభుత్వం నుంచి అధికారిక ఉత్తర్వులు వెలువడి, స్థానిక పోస్టాఫీసులో పాస్‌పోర్ట్ సేవలు ప్రజలకు అందుబాటులోకి వస్తాయని ధీమా వ్యక్తం చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>