కలం, ఖమ్మం బ్యూరో: ఎన్నికల ముందు రాష్ట్రంలోని ప్రతి అత్తకు రూ.4 వేలు, కోడలికి రూ.2,500 ఇస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు చేతులెత్తేశారని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ (Puvvada Ajay Kumar) కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీశారు. రఘునాథపాలెం మండలం మంచుకొండలో శనివారం నిర్వహించిన బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి 420 దొంగ హామీలు, ఆరు గ్యారంటీలు ఇచ్చి ప్రజలను నిలువునా ముంచిందని విమర్శించారు. ఎన్నికల ముందు గ్యారంటీ కార్డులు పంచి, ఇప్పుడు పథకాలను అమలు చేయడం లేదని ఎద్దేవా చేశారు. వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రుణమాఫీ పేరుతో రైతులకు టోపీ పెట్టారని ఆరోపించారు.
రైతులకు భరోసా లేదు..
కేసీఆర్ అందించిన రూ.10వేలు రైతుబంధును మార్చి ‘రైతు భరోసా’ అని పేరు పెట్టారే తప్ప, రైతులకు ఎలాంటి భరోసా లేకుండా చేశారని పువ్వాడ ఆరోపించారు. సాగునీరు లేక రైతాంగం తీవ్ర గోస పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ ఆశీస్సులతో రఘునాథపాలెం మండలాన్ని ఎంతో అభివృద్ధి చేశానని తెలిపారు. కాంగ్రెస్ పాలనలో నాణ్యత లేకుండా పనులు చేయడం వల్లే రాజీవ్ కాలువ కొట్టుకుపోయిందని, అది చూస్తేనే ఈ ప్రభుత్వ పాలన తీరు ఏంటో అర్థమవుతుందని మండిపడ్డారు. ఎన్నికలు ఉన్నా లేకపోయినా ప్రజల పక్షాన నిలబడి కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు నిరంతరం పోరాడుతూనే ఉంటానని పువ్వాడ స్పష్టం చేశారు.

