వేళకు రాని బస్సులు.. విసిగిపోతున్న విద్యార్థులు!

క‌లం, మెదక్ బ్యూరో: మెదక్ (Medak) జిల్లాలో బస్సులు వేళాపాళా లేకుండా నడుస్తుండటంతో వేలాది మంది విద్యార్థుల చదువు ప్రశ్నార్థకంగా మారుతోంది. సమయానికి బస్సులు రాక, గంటల తరబడి బస్టాండ్లలో వేచి చూడలేక విసిగిపోతున్నారు. బస్సులు ఆలస్యంగా రావడం, క్లాసులకు ఆలస్యంగా వెళ్లడం.. రోజూ ఇదే తంతు. మెదక్ జిల్లాలో మెద‌క్ , న‌ర్సాపూర్ బ‌స్ డిపోలు ఉండగా మొత్తం 108 ఆర్టీసీ బస్సులు ఉన్నాయి. 29 మార్గాల్లో బ‌స్సులు న‌డుస్తుంటాయి. మెద‌క్ – జేబీఎస్, న‌ర్సాపూర్ – జేబీఎస్, తూప్రాన్ – హైదరాబాద్, మెద‌క్ – ప‌టాన్ చెరువు వ‌యా సంగారెడ్డి, రామ‌యం పేట – సిద్దిపేట, మెద‌క్ టూ సిద్దిపేట వ‌యా రామ‌యంపేట, తూప్రాన్ టూ మెదక్ వ‌యా చేగుంట మ‌ధ్య బ‌స్సు స‌ర్వీసులు ఎక్కువ‌గా నడుస్తుంటాయి.

డబ్బులు పెట్టుకుని వెళ్తూ..

మెద‌క్, న‌ర్సాపూర్, రామ‌యంపేట, తూప్రాన్ ప‌ట్ట‌ణాల్లో ఇంట‌ర్, డిగ్రీ చ‌దువుల కోసం వందలాది మంది రోజూ ఆర్టీసీ బస్సుల్లో రాకపోకలు సాగిస్తుంటారు. హైద‌రాబాద్ శివారు ప్రాంతాల్లోని కాలేజీల్లో చదువుకునేవారు సైతం బస్సుల్లోనే వెళ్లొస్తుంటారు. ఇలా సుదూర ప్రాంతాలకు వెళ్లి విద్యను అభ్యసించే క్రమంలో ఆయా ప్రాంతాల నుంచి సమయానికి బస్సులు రాక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

తెలంగాణ ఆర్టీసీ విద్యార్థులకు బస్టాండ్లలో స్టూడెంట్ పాసులు ఇస్తోంది. అయితే, ఇటీవల కాలంలో పాసులను కొన్ని బస్సులకే పరిమితం చేశారు. దీంతో సాధారణ ఆర్టీసీ బస్సులు రాకపోవడంతో డబ్బులు వెచ్చించి డీలక్స్, ఎక్స్‌ప్రెస్ బ‌స్సుల్లో కాలేజీలకు వెళ్లాల్సి వస్తోంది. మరోవైపు కొంతమంది కండక్టర్లు స్టూడెంట్ బస్ పాస్ అనుమతి ఉన్నా.. లేదంటూ విద్యార్థులను వేధిస్తున్నారనే ఆరోపణలున్నాయి.

డ్రాపౌట్స్ పెరిగే అవకాశం..

చాలా గ్రామాలకు పల్లె వెలుగు బస్సులు స‌ర్వీసులు తిర‌గ‌డం లేదని విద్యార్థులు చెబుతున్నారు. ఒకవేళ వచ్చినా ఆలస్యంగా వస్తుండటంతో క్లాసులకు హాజరు కాలేకపోతున్నట్లు వాపోతున్నారు. బ‌స్సుల్లో ప్రయాణించి ప‌ట్ట‌ణాల‌కు వెళ్లి చదువుకునేవారిలో ఎక్కువ శాతం పేద, మధ్య త‌ర‌గ‌తి విద్యార్థులే ఉంటారు. సమయానికి బ‌స్సులు రాని కార‌ణంగా.. చదువుపై ఆసక్తి తగ్గి డ్రాపౌట్స్ పెరిగే అవకాశాలున్నాయని విద్యా నిపుణులు ఆందోళన చెందుతున్నారు.

అందుకే, ఇకనైనా ఆర్టీసీ యాజమాన్యం స్పందించి, ప్రతి గ్రామానికి సమయానికి అనుగుణంగా బస్సు బ‌స్సుల సర్వీసులను నడిపించాలని విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు. తమ విద్య కొనసాగించాలంటే బస్సు ప్రయాణం ఒక్క‌టే మార్గ‌మాని, ఆర్టీసీ అధికారులు స్పందించాలని జిల్లా విద్యార్థులు విన్నవిస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>