జిల్లాలో భూ సమస్యలు.. అధికారులకు పొంగులేటి వార్నింగ్

కలం, నిజామాబాద్ బ్యూరో: రాష్ట్రంలో భూ స‌మ‌స్య‌ల‌కు శాశ్వ‌త ప‌రిష్కారం చూప‌డ‌మే ల‌క్ష్యంగా ప్ర‌భుత్వం చేప‌ట్గిన భూ రీస‌ర్వేను జిల్లాలో వేగవంతం చేయాల‌ని సంబంధిత అధికారులను రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas Reddy) ఆదేశించారు. ఏడాదిన్న‌ర లోపు వ్య‌వ‌సాయ భూముల‌తోపాటు ఆబాదీ ఆస్తుల రీసర్వే పూర్తిచేయాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకున్న‌ట్లు వెల్ల‌డించారు. శ‌నివారం నాడు ఉమ్మ‌డి నిజామాబాద్ జిల్లాలో విస్తృతంగా ప‌ర్య‌టించి ప‌లు అభివృద్ది ప‌నుల‌కు శంకుస్ధాప‌న చేశారు. నాగారంలోని నిర్మితి కేంద్రంలో ఇందిర‌మ్మ హౌసింగ్ ట‌వ‌ర్స్ కోసం స్ధ‌లాన్ని ప‌రిశీలించారు.

అలాగే పాముల బ‌స్తీలో ఇందిర‌మ్మ ఇళ్ల ల‌బ్దిదారుల‌తో ముఖాముఖి నిర్వ‌హించారు. ఆ త‌ర్వాత డ‌బుల్ బెడ్ రూమ్ ల‌బ్దిదారుల‌కు ఇళ్ళ ప‌ట్టాలు అంద‌జేశారు. అనంతరం క‌లెక్ట‌రేట్‌లో నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల రెవెన్యూ, హౌసింగ్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్, సర్వే శాఖల అధికారులతో మంత్రి సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. ఈ సంద‌ర్బంగా మంత్రి (Ponguleti) మాట్లాడుతూ.. ప్రజల సమస్యల పరిష్కారంలో ప్రజలను అనవసరంగా కార్యాలయాల చుట్టూ తిప్పుతూ ఇబ్బందులకు గురిచేస్తే మాత్రం ఎంతటివారైనా ఉపేక్షించే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు.

పదేపదే సూచించినా పనితీరులో మార్పు రాని అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. భూభారతి రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తులు, సాదాబైనామా అర్జీల పరిష్కారంలో జాప్యం చేస్తున్న తహసీల్దార్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల సమస్యలను పరిష్కరించడంలో నిర్లక్ష్యం వహిస్తే ఎంతటివారైనా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు.

శాశ్వత పరిష్కారం కోసమే రీ సర్వే..

రాష్ట్రంలోని భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకే ప్రభుత్వం రీ సర్వే చేపడుతోందని మంత్రి తెలిపారు. ఏడాదిన్నరలోపు వ్యవసాయ భూములతో పాటు ఆబాది ఆస్తుల రీ సర్వే పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు. తొలి దశలో ప్రతి జిల్లాలో 70 గ్రామాల్లో రీ సర్వే కొనసాగుతోందన్నారు. రీ సర్వే జరుగుతున్న గ్రామాల్లో కలెక్టర్లు, రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటించి సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు నిర్మాణ వ్యయం తగ్గించేందుకు సిమెంట్ బ్యాగ్‌ను కేవలం రూ.230కే అందించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. పేద కుటుంబాలపై నిర్మాణ భారం తగ్గించడంతో పాటు ఇళ్ల నిర్మాణాన్ని వేగవంతం చేయడమే ప్రభుత్వ ఉద్దేశమన్నారు.

గృహప్రవేశంలో ఉత్సాహంగా..

లబ్ధిదారుల సంతోషంలో భాగస్వామ్యం కావడం తనకు ఎంతో ఆనందంగా ఉందని మంత్రి (Ponguleti) పేర్కొంటూ, నూతన గృహ ప్రవేశం చేసుకున్న కుటుంబాలకు శుభాకాంక్షలు తెలిపారు. నూతన వస్త్రాలను బహూకరించారు. చివరి దశలో ఉన్న ఇళ్లను కూడా పరిశీలించి పనులను త్వరగా పూర్తి చేసుకోవాలని సూచించారు.

డబుల్ బెడ్ రూమ్‌ల పరిశీలన..

కలెక్టరేట్ వద్ద నిర్మించిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను మంత్రి పరిశీలించారు. పెండింగ్ పనులను తక్షణమే పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. నిధుల కొరత లేదని, పనులు పూర్తయిన 24 గంటల్లోనే బిల్లులు మంజూరు చేస్తామని స్పష్టం చేశారు. డబుల్ బెడ్‌రూమ్ భవన సముదాయాన్ని యుద్ధప్రాతిపదికన పూర్తి చేసి హౌసింగ్ శాఖకు అప్పగించాలని అధికారులను ఆదేశించారు. విద్యుత్, తాగునీరు, పారిశుధ్య పనులను కూడా వెంటనే పూర్తి చేయాలని సూచించారు.

400 మందికి డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీ..

స్థానిక రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో నిర్వహించిన కార్యక్రమంలో నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గానికి చెందిన 400 మంది లబ్ధిదారులకు మంత్రి పొంగులేటి చేతుల మీదుగా డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల కేటాయింపు పత్రాలను పంపిణీ చేశారు. మరో వారం, పది రోజుల్లో మరో 300 మంది లబ్ధిదారులకు ఇళ్లు అందిస్తామని మంత్రి వెల్లడించారు. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల కేటాయింపులు పూర్తి పారదర్శకంగా, అర్హత ప్రాతిపదికన జరిగేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. మొదటి విడతలో 4.50 లక్షల ఇళ్లు, రెండో విడతలో 2.50 లక్షల ఇళ్లు, హైదరాబాద్‌లో మరో లక్ష ఇళ్లను కలుపుకుని ఇప్పటివరకు మొత్తం 8 లక్షల ఇళ్లకు మంజూరు ఇచ్చామని మంత్రి తెలిపారు.

ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమం నిరంతర ప్రక్రియ అని, అర్హులైన ప్రతి పేద కుటుంబానికి సొంతింటి కల సాకారం అయ్యే వరకు విడతల వారీగా ఇళ్లను మంజూరు చేస్తూనే ఉంటామని స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలో పదేళ్లలో పేదలకు తగిన స్థాయిలో ఇళ్లు నిర్మించలేదని విమర్శించిన మంత్రి, గత ప్రభుత్వంలో అసంపూర్తిగా మిగిలిపోయిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను కూడా పూర్తి చేసి లబ్ధిదారులకు అందించే బాధ్యతను ప్రజా ప్రభుత్వం తీసుకుందని తెలిపారు.

ఈ కార్య‌క్ర‌మాల్లో ప్రభుత్వ సలహాదారు పి. సుదర్శన్ రెడ్డి, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్యేలు ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్తా, డాక్టర్ భూపతి రెడ్డి, నగర మేయర్ ఉమారాణి, హౌసింగ్ శాఖ ఎండీ గౌతమ్, కలెక్టర్ భవేష్ మిశ్రా, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, నుడా చైర్మన్ కేశ వేణు తదితరులు పాల్గొన్నారు.

Also Read : రాహుల్ గాంధీ ఇంటి ముందు సిక్కుల ఆందోళ‌న‌!

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>