కలం, మహబూబ్‌నగర్ బ్యూరో: శాంతి కమిటీ సభ్యులు యువతకు మార్గదర్శకంగా నిలవాలని జిల్లా ఎస్పీ జానకి పిలుపునిచ్చారు. మహబూబ్‌నగర్ జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయం పరేడ్ గ్రౌండ్ హాల్లో జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో శాంతి కమిటీ సమావేశం శనివారం నిర్వహించారు. రాబోయే వివిధ మతాల పండుగలను దృష్టిలో ఉంచుకుని జిల్లాలో శాంతిభద్రతలు, మత సామరస్యం, సోదరభావం, ప్రజల మధ్య ఐక్యతను మరింత బలోపేతం చేయడంపై సమావేశంలో విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ జానకి మాట్లాడుతూ.. మహబూబ్‌నగర్ జిల్లాలో అన్ని మతాల ప్రజలు ఎప్పటి నుంచో పరస్పర గౌరవం, సోదరభావంతో పండుగలను జరుపుకొంటూ శాంతియుత వాతావరణాన్ని కొనసాగిస్తున్నారని తెలిపారు.
ప్రజాప్రతినిధులదే కీలక పాత్ర
గతంలో కూడా అన్ని వర్గాల ప్రజలు పోలీసు శాఖకు అందించిన సహకారం అభినందనీయమని, అదే స్ఫూర్తితో రాబోయే అన్ని పండుగలను కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా ప్రశాంతంగా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. శాంతి కమిటీ సభ్యులు, మతపెద్దలు, సమాజంలోని పెద్దలు, ప్రజాప్రతినిధులు కీలక పాత్ర పోషించాలని ఎస్పీ సూచించారు. ముఖ్యంగా యువతను సరైన మార్గంలో నడిపించడంలో పెద్దలు మార్గదర్శకులుగా నిలవాలని, యువతలో సామాజిక బాధ్యత, మత సామరస్యం, సోదరభావం పెంపొందించేలా అవగాహన కల్పించాలని కోరారు. యువత ఎలాంటి వివాదాలకు, గొడవలకు, ఇతరులను రెచ్చగొట్టే చర్యలకు పాల్పడకుండా వారికి దిశానిర్దేశం చేయాల్సిన బాధ్యత పెద్దలపై ఉందన్నారు.
డీజే వినియోగంపై కీలక సూచనలు
అదేవిధంగా డీజే వినియోగంపై కూడా ఎస్పీ ప్రత్యేకంగా సూచనలు చేశారు. పండుగల సమయంలో డీజేలు, అధిక శబ్దంతో కూడిన సౌండ్ సిస్టమ్‌లను నిబంధనలకు విరుద్ధంగా వినియోగించకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని తెలిపారు. అధిక శబ్దం వల్ల వృద్ధులు, చిన్నపిల్లలు, అనారోగ్యంతో ఉన్నవారు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని, ప్రజల ఆరోగ్యం, ప్రశాంతమైన వాతావరణాన్ని దృష్టిలో ఉంచుకుని డీజేలు, సౌండ్ సిస్టమ్‌లను పరిమితంగా, నిబంధనలకు అనుగుణంగా వినియోగించాలని కోరారు. సోషల్ మీడియాను బాధ్యతాయుతంగా వినియోగించాలని జిల్లా ఎస్పీ స్పష్టం చేశారు. అనవసరమైన, వివాదాస్పదమైన, రెచ్చగొట్టే పోస్టులు పెట్టడం, ఒక మతానికి లేదా వర్గానికి వ్యతిరేకంగా ఉన్న సమాచారాన్ని ప్రచారం చేయడం, ఫేక్ న్యూస్‌ను వైరల్ చేయడం, నిర్ధారణ లేని సమాచారాన్ని ఇతరులకు ఫార్వర్డ్ చేయడం వంటి చర్యలకు ప్రతి ఒక్కరూ దూరంగా ఉండాలని సూచించారు.
ఫేక్ న్యూస్ షేర్ చేయొద్దు
సోషల్ మీడియాలో వచ్చే ప్రతి సమాచారాన్ని నిజమని నమ్మకుండా, దాని వాస్తవికతను నిర్ధారించుకున్న తర్వాతే స్పందించాలని తెలిపారు. ముఖ్యంగా పండుగల సమయంలో మత విద్వేషాలు, అపోహలు లేదా ఉద్రిక్తతలకు దారితీసే సమాచారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ షేర్ చేయవద్దని సూచించారు. తప్పుడు వార్తలు, రెచ్చగొట్టే పోస్టులు లేదా ఉద్దేశపూర్వకంగా వివాదాలకు దారితీసే సమాచారాన్ని ప్రచారం చేసే వారిపై పోలీసు శాఖ నిరంతరం నిఘా ఉంచుతుందని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టప్రకారం కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ హెచ్చరించారు.
సమావేశంలో పాల్గొన్న వివిధ మతాల మతపెద్దలు, శాంతి కమిటీ సభ్యులు, కార్పొరేటర్లు , ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ, జిల్లాలో అన్ని మతాల ప్రజల మధ్య ఉన్న సోదరభావం, ఐక్యతను మరింత బలోపేతం చేసేందుకు తమ వంతు కృషి చేస్తామని తెలిపారు. రాబోయే పండుగలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పోలీసు శాఖకు పూర్తి సహకారం అందిస్తామని, యువతకు సానుకూల దిశానిర్దేశం చేస్తామని పేర్కొన్నారు. జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసు శాఖ అన్ని విధాలుగా అప్రమత్తంగా ఉంటుందని, రాబోయే పండుగలను ప్రశాంతంగా నిర్వహించేందుకు అవసరమైన భద్రతా చర్యలు చేపడతామని ఎస్పీ జానకి తెలిపారు.
ఈ సమావేశంలో అదనపు ఎస్పీ ఎన్బీ రత్నం, డీఎస్పీ వెంకటేశ్వర్లు, డీసీఆర్బీడీఎస్పీ రమణా రెడ్డి, వన్ టౌన్ ఇన్స్పెక్టర్ అప్పయ్య, టూ టౌన్ ఇన్స్పెక్టర్ ఇజాజ్ఉద్దీన్, జడ్చర్ల టౌన్ ఇన్స్పెక్టర్ కమలాకర్, ఆర్ఐ కృష్ణయ్య, విశ్వహిందూ పరిషత్ ప్రెసిడెంట్ యాది రెడ్డి, ఎంఐఎం ప్రెసిడెంట్ హాదీ, జడ్చర్ల టౌన్ హిందూ, ముస్లిం మత పెద్దలు, ఐఎన్టీయూసీ ప్రెసిడెంట్ రాములు యాదవ్, కార్పొరేటర్లు, శాంతి కమిటీ సభ్యులు, వివిధ మతాల మతపెద్దలు, కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు, పోలీసు అధికారులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

