కలం, నిజామాబాద్ బ్యూరో: పేదల సొంతింటి కలను సాకారం చేసి, వారి ఆత్మగౌరవాన్ని పెంపొందించడమే ప్రజా ప్రభుత్వం సంకల్పమని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas Reddy) వెల్లడించారు. నిజామాబాద్ నగరంలో శనివారం మంత్రి పలు ప్రాంతాలలో పర్యటించి అభివృద్ధి పనులను పరిశీలించారు. నాగారంలోని నిర్మితి కేంద్రంలో గృహ నిర్మాణ శాఖ ఆధ్వర్యంలో లబ్ధిదారుల కోసం నిర్మించనున్న హౌసింగ్ టవర్స్ స్థలాన్ని పరిశీలించారు. రెండు ఎకరాల విస్తీర్ణంలో 6 అంతస్తులతో కూడిన టవర్స్ నిర్మించనున్న నేపథ్యంలో తగిన సదుపాయాలు అందుబాటులో ఉన్నాయా అని క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపారు.
లబ్దిదారులు హర్షాతిరేకాలు..
అనంతరం 43వ డివిజన్ లోని పాముల బస్తీలో ఇందిరమ్మ పథకం కింద ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసుకున్న లబ్ధిదారులతో మంత్రి పొంగులేటి భేటీ అయ్యారు. ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించి, సకాలంలో బిల్లులు వచ్చాయా? అని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వం తమ సొంత ఇంటి కలను సాకారం చేసిందని లబ్దిదారులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తూ, ప్రభుత్వానికి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కూడా తమ కృతజ్ఞతలు తెలియజేయాలని మంత్రిని కోరారు. లబ్దిదారులను కలిసి వారి సంతోషంలో పాలు పంచుకోవడం తనకు కూడా ఎంతో ఆనందంగా ఉందని ఈ సందర్భంగా మంత్రి హర్షం వ్యక్తం చేశారు.
లబ్ధిదారులకు గృహ ప్రవేశ శుభాకాంక్షలు తెలియజేస్తూ, నూతన వస్త్రాలు బహూకరించారు. చివరి దశ నిర్మాణంలో ఉన్న ఇళ్లను సైతం సందర్శించి, త్వరగా నిర్మాణం పూర్తి చేసుకోవాలని లబ్దిదారులకు పొంగులేటి సూచించారు. అక్కడి నుండి ఐ.డీ.ఓ.సీని ఆనుకుని నిర్మించిన రెండు పడక గదుల ఇళ్ళను పరిశీలించారు. తక్షణమే పెండింగ్ పనులను పూర్తి చేయాలని కంట్రాక్టర్ ను ఆదేశించారు. నిధుల కొరత ఎంతమాత్రం లేదని, పనులు పూర్తి చేసిన 24 గంటల వ్యవధిలో బిల్లులు మంజూరు చేస్తామని అన్నారు. గుత్తేదారుతో యుద్ధప్రాతిపదికన పనులు పూర్తి చేయించి, డబుల్ బెడ్ రూమ్ భవన సముదాయాన్ని స్వాధీనపర్చుకోవాలని హౌసింగ్ అధికారులను ఆదేశించారు. విద్యుత్, తాగునీరు, సానిటేషన్ పనులను వెంటనే చేపట్టి పూర్తి చేయాలన్నారు.
లబ్ధిదారులకు ఇళ్ల పత్రాలు పంపిణీ..
నిజామాబాద్ రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గ లబ్ధిదారులకు మంత్రి పొంగులేటి చేతుల మీదుగా డబుల్ బెడ్రూం ఇండ్ల పంపిణీ కేటాయింపు పత్రాలు పంపిణీ చేశారు. ప్రభుత్వ సలహాదారు పి.సుదర్శన్ రెడ్డి, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్యేలు ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా, డాక్టర్ భూపతి రెడ్డి, నగర మేయర్ ఉమారాణి, గృహ నిర్మాణ సంస్థ ఎం.డీ గౌతమ్, కలెక్టర్ భవేష్ మిశ్రా, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, నుడా చైర్మన్ కేశ వేణు తదితరులు ఈ కార్యక్రమంలో భాగస్వాములు అయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. కులం, మతం, రాజకీయాలకు అతీతంగా పట్టణం, గ్రామం, గూడెం, తండా అనే తేడా లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. మొదటి విడతలో రాష్ట్రంలో 4.50 లక్షల ఇళ్ళను మంజూరు చేశామని, రెండవ విడతలో 2.5 లక్షల ఇళ్ళను, హైదరాబాద్ లో లక్ష ఇళ్ళను కలుపుకుని ఇప్పటివరకు మొత్తం 8 లక్షల ఇళ్ళను తమ ప్రభుత్వం పేదలకు అందిస్తోందని మంత్రి అన్నారు. ఇది నిరంతర ప్రక్రియ అని, అర్హులైన ప్రతి పేద కుటుంబానికి సొంత ఇంటి కలను సాకారం చేసేంత వరకు విడతల వారీగా ఇందిరమ్మ ఇళ్ళను మంజూరు చేస్తూనే ఉంటామని స్పష్టం చేశారు.
కమీషన్లకు ఆశపడ్డారు..
గత ప్రభుత్వ హయాంలో కమీషన్ లకు ఆశపడి కాళేశ్వరం కట్టారు కానీ, పదేళ్ల కాలంలో పేదలకు ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదని మంత్రి పొంగులేటి ఆక్షేపించారు. గత ప్రభుత్వం ఒకవేళ ఏడాదికి రెండు లక్షల చొప్పున ఇండ్లు ఇచ్చి ఉంటే, నేడు తెలంగాణ రాష్ట్రంలో పేదలందరికీ సొంత ఇండ్లు సమకూరేవని అన్నారు. గత ప్రభుత్వంలో అసంపూర్తిగా మిగిలిపోయిన, మొండి గోడలకే పరిమితమైన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళను సైతం పూర్తి చేసి, లబ్దిదారులకు కేటాయించేలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు.
400 మంది లబ్దిదారులకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు..
ఇందులో భాగంగానే నిజామాబాద్ నగరంలో ప్రస్తుతం 400 మంది లబ్దిదారులకు రెండు పడక గదుల ఇళ్ళను పంపిణీ చేస్తున్నామని, వారం పది రోజుల్లో మరో 300 మందికి అందజేస్తామని అన్నారు. ఇళ్ళ కేటాయింపులు పూర్తి పారదర్శకంగా జరిగేలా, అర్హులైన వారికే దక్కేలా చర్యలు తీసుకున్నామని అన్నారు. పట్టణాలు, నగరాలలో ఇళ్ళ స్థలాలు లేని నిరుపేదల కోసం హైదరాబాద్ తరహాలోనే ఇందిరమ్మ టవర్స్ నిర్మాణం కోసం చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
ఇందులో భాగంగానే నిజామాబాద్ నగరంలో హౌసింగ్ బోర్డుకు చెందిన నాగారం నిర్మితి కేంద్రం వద్ద ప్రయోగాత్మకంగా ఇందిరమ్మ టవర్స్ నిర్మించేందుకు స్థలాన్ని పరిశీలించామని తెలిపారు. వారం రోజుల్లో పనులు ప్రారంభించాలని అధికారులను ఆదేశించామన్నారు. గత ప్రభుత్వ అసంబద్ధ నిర్ణయాలతో 8.20లక్షల కోట్ల రూపాయల అప్పుల భారంలో రాష్ట్రం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పటికీ, ప్రతి పేద కుటుంబానికి సంక్షేమ పథకాలను వర్తింపజేయడమే సంకల్పంగా తమ ప్రభుత్వం ముందుకెళ్తోందన్నారు.
రేవంత్ నేతృత్వంలో ప్రజాపాలన..
ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా రేవంత్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం పాలన సాగిస్తోందని అన్నారు. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని ప్రాధాన్యతా క్రమంలో అమలు చేస్తున్నామని, ఇందులో భాగంగానే ఏడాది కాలంలోనే మొదటి విడత కింద 4.50లక్షల కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసి, పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలోనే అత్యధికంగా నిజామాబాద్ జిల్లాలో ఇందిరమ్మ ఇండ్లు మంజూరయ్యాయని వివరించారు. ఓ వైపు ఇందిరమ్మ ఇళ్లు, సన్న బియ్యం, ఉచిత విద్యుత్, ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం వంటి సంక్షేమ పథకాలు అమలు చేస్తూనే, మరోవైపు సమాంతరంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని అన్నారు.
ప్రతిపక్షాలవి పసలేని ఆరోపణలు..
అయినప్పటికీ, ప్రతిపక్షాలు పసలేని ఆరోపణలు చేస్తున్నాయని దుయ్యబట్టారు. ప్రజలు వాస్తవాలను గమనించాలని, సంక్షేమాభివృద్ధికి పాటుపడుతున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వెన్నుదన్నుగా నిలవాలని ఎమ్మెల్సీ మహేష్ గౌడ్ కోరారు. ఎమ్మెల్యేలు సూర్యనారాయణ గుప్తా, డాక్టర్ భూపతి రెడ్డిలు మాట్లాడుతూ.. డబుల్ బెడ్రూం ఇండ్ల పంపిణీ పట్ల హర్షం వ్యక్తం చేశారు. మంత్రి వెంట సీపీ సాయి చైతన్య, డీఆర్ఓ గీత, ఆర్డీఓ రాజేంద్రకుమార్, నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్ తదితరులు ఉన్నారు.

