కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అమెరికా పర్యటనకు విదేశాంగ శాఖ ‘పొలిటికల్ క్లియరెన్స్’ ఇవ్వకపోవడం వెనక రాజకీయ కారణాలున్నాయని సీఎంఓ ఒక ప్రకటనలో వ్యాఖ్యానించింది. నిబంధనలకు అనుగుణంగా ఆయన కార్యక్రమం లేనందువల్లనే అనుమతి ఇవ్వలేదని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ వివరణ ఇచ్చారు. అయితే అనుగుణంగా లేని అంశాలను మాత్రం వెల్లడించలేదు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటనకు అనుమతి ఇవ్వకపోవడం జాతీయ రాజకీయాల్లోనే చర్చకు దారితీసింది.
ముఖ్యమంత్రి రూపొందించుకున్న కార్యక్రమాలేంటి? నిబంధనలకు అనుగుణంగా లేనివి ఏంటి? ఇవీవే ఇప్పటివరకు బహిర్గతం కాలేదు. కానీ నిర్దిష్టంగా కొన్ని అంశాలపై కేంద్ర ప్రభుత్వానికి భిన్నాభిప్రాయాలు, ఆందోళన ఉన్న కారణంగానే ఆ పర్యటనకు అనుమతి ఇవ్వడానికి నిరాకరించిందని విదేశాంగ శాఖ వర్గాల ద్వారా తెలిసింది. ఈ విషయానికి సంబంధించి పలు అంశాలను ‘ట్రిబ్యూన్’ అనే పత్రిక పేర్కొన్నది.
న్యూయార్క్ మేయర్ మమ్దానీతో భేటీ ఆలోచన :
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అమెరికా పర్యటనలో భాగంగా న్యూయార్క్ సిటీ మేయర్ జోహ్రాన్ మమ్దానీని కలవాలని (Revanth – Mamdani Meeting) ప్లాన్ చేసుకున్నట్లు విదేశాంగ శాఖ వర్గాలకు సమాచారం అందింది. దీన్ని సీఎం కార్యాలయం షెడ్యూలు (ఇటెరినరీ)లో పెట్టలేదని, కానీ సెంట్రల్ ఇంటెలిజెన్స్ బ్యూరో వర్గాలతో పాటు అమెరికాలోని ఇండియన్ ఎంబసీ నుంచి తెలుసుకున్న వివరాల్లో వీరిద్దరి మధ్య భేటీ ఉన్నట్లు అంచనాకు వచ్చింది. జోహ్రాన్ మమ్దానీ ఈ నెల 9వ తేదీన న్యూయార్క్ లోని బ్రూక్లిన్ కోనీ ఐలాండ్ ఎవెన్యూలో అల్లమా ఇక్బాల్ కమ్యూనిటీ సెంటర్లో జరిగిన ‘పాకిస్తాన్ స్వాతంత్ర్య దినోత్సవ మేళా’లో పాల్గొన్నారని విదేశాంగ శాఖ దగ్గర సమాచారం ఉంది.
న్యూయార్క్ నగరంలో మే నెలలో జరిగిన ‘ఇజ్రాయెల్ డే పెరేడ్’కు గైర్హాజరైన మమ్దానీ (Mamdani) పాకిస్తాన్ స్వాతంత్ర్య దినోత్సవ మేళాకు హాజరు కావడాన్ని పరిగణనలోకి తీసుకున్నది. గతంలో పాకిస్తాన్‌కు అనుకూలంగా కామెంట్స్ చేసిన మమ్దానీని సీఎం రేవంత్‌రెడ్డి (Revanth Reddy) సమావేశం కావడానికి చేస్తున్న ప్రయత్నాల దృష్ట్యా అమెరికా టూర్‌కు అవసరమైన ‘పొలిటికల్ క్లియరెన్స్’ ఇవ్వడానికి విదేశాంగ శాఖ నిరాకరించినట్లు సమాచారం.
Yesterday, I gathered with residents at the Allama Iqbal Community Center’s Mela to commemorate Pakistan’s Independence Day and honor the contributions Pakistani New Yorkers have made to our city.
Today and everyday, we celebrate this community whose open arms, determination,… pic.twitter.com/LpcenigAJd
— Mayor Zohran Kwame Mamdani (@NYCMayor) August 10, 2026
గతంలో మోదీకి వ్యతిరేకంగా మమ్దానీ కామెంట్స్ :
భారత ప్రధాని మోదీపైనా, కేంద్ర ప్రభుత్వంపైనా గతంలో మమ్దానీ చేసిన వ్యాఖ్యలు కూడా విదేశాంగ శాఖ గమనంలో ఉన్నాయనేది కూడా మరో అంశంగా కనిపిస్తున్నది. “భారత ప్రధాని మోదీ న్యూయార్క్ లో ఏదైనా కార్యక్రమానికి వస్తే నేను ఆయనతో కలిసి వేదిక పంచుకోను. గుజరాత్లో ముస్లింల సామూహిక హత్యాకాండను ఆర్గనైజ్ చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారు.. ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహును నేను ఏ దృష్టితో చూస్తానో, ఎలా పరిగణిస్తానో మోదీని కూడా అలానే చూస్తాను. ఆయన ‘యుద్ధ నేరస్థుడు’ (వార్ క్రిమినల్)” అని మమ్దానీ వ్యాఖ్యానించారు.
జైల్లో ఉన్న జేఎన్‌యూ స్టూడెంట్, ఉద్యమ కార్యకర్త ఒమర్ ఖలీద్‌కు మమ్దానీ గతంలో లేఖ రాయడం కూడా విదేశాంగ శాఖ గమనంలో ఉన్నది. భారత పొలిటికల్, జ్యుడిషియల్ వ్యవహారాలను ఉద్దేశించి మమ్దానీ చేసిన వ్యాఖ్యలు, ఆయన వైఖరిపై గతంలోనే కేంద్ర ప్రభుత్వం కౌంటర్ ఇచ్చింది. “ఇతర ప్రజాస్వామ్య దేశాల్లో న్యాయవ్యవస్థ స్వతంత్రతను ప్రజాప్రతినిధులు గౌరవించాలి.. విదేశాల్లో జరుగుతున్న న్యాయపరమైన వ్యవహారాలపై వ్యక్తిగత అభిప్రాయాలు వ్యక్తం చేయకుండా ఉండాలి..” అని కేంద్ర ప్రభుత్వం కామెంట్ చేసింది. మమ్దానీతో సీఎం రేవంత్‌రెడ్డి ప్రతిపాదిత భేటీ కేంద్ర ప్రభుత్వానికి ప్రధాన ఆందోళనగా మారిందని ఉన్నత స్థాయి దౌత్య వర్గాల సమాచారం.
ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్‌కు అటెండ్ కావడం :
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అమెరికా పర్యటన షెడ్యూలు ప్రకారం ఈ నెల 26 సాయంత్రం ఆయన న్యూయార్క్ నగరంలో ‘ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్’ సమావేశంలో పాల్గొంటారని సీఎంఓ కార్యాలయం పేర్కొన్నది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా వెళ్తూ అక్కడ జరిగే కాంగ్రెస్ పొలిటికల్ ఈవెంట్లో పాల్గొనడం కూడా నిబంధనలకు అనుగుణంగా లేదన్నది విదేశాంగ శాఖ అభిప్రాయమన్నది ఆ వర్గాల ద్వారా తెలిసింది.
“సీఎం రేవంత్‌రెడ్డి పర్యటనల్లో ప్రతిపాదించిన కార్యక్రమాలు ఆయన నిర్వహిస్తున్న పదవికి, పర్యటన ఉద్దేశానికి తగినవిగా ఉండాలి… ఈ ప్రత్యేక సందర్భంలో అమెరికా పర్యటనకు సంబంధించి అది జరగలేదు… అందువల్ల అనుమతి నిరాకరించాం” అని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ శుక్రవారం మీడియా సమావేశంలో పేర్కొన్నారు. ముఖ్యమంత్రులు, ఇతర ప్రముఖుల విదేశీ పర్యటనలను రాజకీయ అనుమతి కోసం విదేశాంగ మంత్రిత్వ శాఖ పరిశీలిస్తుందని వివరించారు. లండన్ టూర్ ప్రతిపాదనలకు అనుగుణంగా ఉన్నందునే అనుమతి ఇచ్చామని పేర్కొన్నారు.
షెడ్యూలులో గోప్యంగా ఎందుకు ఉంచారు : ఎంపీ అరవింద్
“రేవంత్‌రెడ్డి అమెరికా పర్యటన సందర్భంగా న్యూయార్క్ నగర మేయర్ జొహ్రాన్ మమ్దానీతో భేటీ కావాల్సి ఉందని వార్తలు వస్తున్నాయి. ఇది అధికారిక కార్యక్రమమైతే తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన అధికారిక పర్యటన కార్యక్రమంలో దాన్ని ఎందుకు చేర్చలేదు? ఒకవేళ ఈ భేటీని ఉద్దేశపూర్వకంగా గోప్యంగా ఉంచినట్లయితే మమ్దానీతో రేవంత్‌రెడ్డికి ఏం పని ఉందో తెలంగాణ ప్రజలకు ప్రభుత్వం చెప్పాలి. కొద్ది రోజుల క్రితమే న్యూయార్క్ లో జరిగిన ప్రధాన ‘ఇండియా డే పరేడ్’కు మమ్దానీ హాజరు కాలేదు. అదే సమయంలో ‘పాకిస్థాన్ డే’ కార్యక్రమానికి హాజరై, అక్కడి పాకిస్థానీ సమాజాన్ని, వారి మూలాలను బహిరంగంగా ప్రశంసించారు.
అంతకుముందు 2020 ఢిల్లీ అల్లర్ల కుట్ర కేసులో యూఏపీఏ కింద నిందితుడిగా కేసు నమోదైన ఉమర్ ఖలీద్‌కు మమ్దానీ వ్యక్తిగత లేఖ రాస్తూ సంఘీభావం వ్యక్తం చేశారు. మమ్దానీ జోక్యంపై భారత ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఇతర దేశాల ప్రజాప్రతినిధులు భారత న్యాయవ్యవస్థ స్వతంత్రతను గౌరవించాలని విదేశాంగ మంత్రిత్వ శాఖ (ఎంఈఏ) స్పష్టం చేసింది. అసలు రేవంత్‌రెడ్డి–మమ్దానీ భేటీని ఎవరు ఏర్పాటు చేశారు? ఎప్పుడు ఖరారైంది? అధికారిక పర్యటన కార్యక్రమం నుంచి ఎందుకు దాచారు? ఈ ప్రశ్నలకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమాధానం చెప్పాలి…” అని ట్వీట్లో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ పేర్కొన్నారు.
I am seeing reports that Revanth Reddy was scheduled to meet New York City Mayor Mr. Zohran Mamdani during his US visit.
If this was an official engagement, why was it kept out of the Telangana Government’s official tour programme?
And if it was deliberately kept under wraps,… pic.twitter.com/ijZmsFPJLF
— Arvind Dharmapuri (@Arvindharmapuri) August 22, 2026
Also Read : నిర్మల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు పూర్వదశ..! 55 ఏళ్ల చరిత్రలో రికార్డ్ ప్రవేశాలు
Follow Us On : WhatsApp

