భూ బాధితులకు న్యాయం చేయండి.. పొంగులేటికి రాజేందర్ రావు విజ్ఞప్తి

కలం, కరీంనగర్: కరీంనగర్ లోని 22ఏ నిషేధిత భూముల జాబితాలో ఉన్న భూముల బాధితులకు తక్షణమే న్యాయం చేయాలని కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జి వెలిచాల రాజేందర్‌రావు రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి (Ponguleti Srinivas Reddy)ని కోరారు. ఈ మేరకు శుక్రవారం జగిత్యాలలో మంత్రిని కలిసి వినతిపత్రం అందజేశారు. కొత్తపల్లి, రేకుర్తి, విద్యానగర్ ప్రాంతాలకు చెందిన ప్రజలు 22ఏ నిషేధిత జాబితా కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని రాజేందర్‌రావు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.

గతంలో రిజిస్ట్రేషన్లు జరిగిన భూములను నిషేధిత జాబితాలో చేర్చడంతో వాటి క్రయవిక్రయాలు నిలిచిపోయాయని తెలిపారు. ఈ భూముల్లో ఎక్కువగా చిన్న, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వారు ఉన్నారని, చాలామంది ప్రభుత్వ అనుమతులతో ఇళ్లు నిర్మించుకుని నివసిస్తున్నారని వివరించారు. ఇంటిపన్నులు చెల్లిస్తూ, గృహ నిర్మాణ రుణాలు పొందిన వారికి రిజిస్ట్రేషన్లు నిలిచిపోవడం తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు దారితీస్తోందన్నారు.

కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలోని రేకుర్తి, విద్యానగర్, కొత్తపల్లి ప్రాంతాల్లో 22ఏ నిషేధిత జాబితా కారణంగా వేలాది మంది ఇబ్బందులు పడుతున్నారని రాజేందర్‌రావు తెలిపారు. అందుబాటులో ఉన్న వివరాల ప్రకారం రేకుర్తి ప్రాంతంలో సుమారు 125 సర్వే నంబర్ల పరిధిలో 555 ఎకరాలు నిషేధిత జాబితాలో ఉన్నాయని, ఈ భూముల్లో సుమారు 3 వేల ఇళ్లు, 6 వేల ప్లాట్లు ఉన్నట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. విద్యానగర్‌కు సంబంధించిన కొన్ని సర్వే నంబర్లలో సుమారు 536 ఎకరాలు, మరో 16 సర్వే నంబర్లలో 115 ఎకరాలు, అలాగే కొత్తపల్లి ప్రాంతంలోని మరికొన్ని పట్టా భూములు 22ఏ జాబితాలో చేరడంతో రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయని ఆయన వివరించారు.

మొత్తం 230 సర్వే నెంబర్లలో 1000 ఎకరాలకు పైగా భూములు నిషేధిత జాబితాలోకి వెళ్లాయని మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. విద్య, వైద్యం, వివాహాలు, కుటుంబ అవసరాల కోసం తమ భూములను విక్రయించుకోవాల్సిన పరిస్థితుల్లో ఉన్న బాధితులు రిజిస్ట్రేషన్లు నిలిచిపోవడంతో తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు. వివాదాలు, కోర్టు కేసులు లేని అర్హత కలిగిన పట్టా భూములను నిబంధనల ప్రకారం పరిశీలించి 22ఏ జాబితా నుంచి తొలగించి రిజిస్ట్రేషన్లకు అవకాశం కల్పించాలని కోరారు.

మంత్రి సానుకూల స్పందన

రాజేందర్‌రావు విజ్ఞప్తి (Velichala Rajender Rao)పై మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సానుకూలంగా స్పందించారు. 22ఏ భూముల సమస్యపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కరీంనగర్ జిల్లా కలెక్టర్‌ను ఆదేశించినట్లు రాజేందర్‌రావు తెలిపారు. బాధితులకు న్యాయం జరిగేలా అవసరమైన చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారని పేర్కొన్నారు. మంత్రి ఆదేశాల అనంతరం రాజేందర్‌రావు కరీంనగర్ కలెక్టర్‌తో రెండుసార్లు ఫోన్‌లో మాట్లాడారు. సమస్య పరిష్కారానికి కలెక్టర్ సైతం చొరవ చూపుతున్నారని తెలిపారు.

“నిషేధిత భూముల కారణంగా ఇబ్బందులు పడుతున్న బాధితులకు న్యాయం జరిగే వరకు వారి తరఫున పోరాడుతాను. మంత్రి సానుకూలంగా స్పందించారు. కలెక్టర్ కూడా సమస్య పరిష్కారానికి చర్యలు చేపడుతున్నారు. అర్హత ఉన్న భూముల విషయంలో త్వరలోనే మంచి నిర్ణయం వస్తుంది. బాధితులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు” అని వెలిచాల రాజేందర్‌రావు తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>