కలం, నల్లగొండ: ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల ఫలాలను సమాజంలోని ప్రతి అర్హుడికి అందించడమే తమ ప్రధాన ధ్యేయమని నల్లగొండ జిల్లా కలెక్టర్(Nalgonda Collector) బి. చంద్రశేఖర్ (Chandrashekar) అన్నారు. శుక్రవారం త్రిపురారం మండలం లోక్యతండ గ్రామంలో కలెక్టర్ పర్యటించి ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకున్నారు. గ్రామంలో ఇంటింటికీ కాలినడకన వెళ్లిన కలెక్టర్ ప్రజలతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ వర్గాల సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు.
రైతులకు పంటలపై సూచనలు
గ్రామ పర్యటనలో రైతు దాస్‌ను కలెక్టర్ పలకరించి ఎంత భూమిలో పంట సాగు చేస్తున్నారని అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం ఒక ఎకరంలో సాగు చేస్తున్నట్లు రైతు చెప్పడంతో మరో ఎకరంలో కందులు వంటి తక్కువ నీటితో పండే పంటలను సాగు చేయాలని సూచించారు. వర్షపాతం తక్కువగా ఉన్న పరిస్థితులలో నీటి వినియోగం తక్కువగా ఉండే పంటలకు ప్రాధాన్యం ఇవ్వాలని తెలిపారు. గ్రామానికి చెందిన ఓ వ్యక్తి తనకు పింఛన్ రావడం లేదని కలెక్టర్ దృష్టికి తీసుకురాగా, వివరాలను పరిశీలించి పింఛన్ వచ్చేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. ప్రస్తుతం గ్రామంలో 43 పింఛన్లు ఉండగా, అదనంగా మరో 13 పింఛన్లు మంజూరు చేయనున్నట్లు తెలిపారు.
40 కుటుంబాలకు నల్లా కనెక్షన్లు
గ్రామంలో మంచినీటి సమస్యను ప్రజలు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. సుమారు 40 కుటుంబాలకు నల్లా కనెక్షన్లు లేవని తెలిపారు. వెంటనే స్పందించిన కలెక్టర్ ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులతో మాట్లాడి నీటి సరఫరా లైన్‌ను పరిశీలించి ఓహెచ్‌ఎస్‌ఆర్‌కు కనెక్షన్ ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రతి కుటుంబం ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలని సూచించిన కలెక్టర్.. గ్రామంలో ఇంకుడు గుంతల నిర్మాణాన్ని చేపట్టాలని ఎంపీడీవోను ఆదేశించారు. గుడిసెలో నివసిస్తున్న ధనావత్ కృష్ణకుమారి తాను ఇందిరమ్మ ఇల్లు కోసం దరఖాస్తు చేసుకున్నట్లు కలెక్టర్‌కు తెలిపారు. వెంటనే ఆన్‌లైన్‌లో వివరాలను పరిశీలించిన కలెక్టర్ ఆమెకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేశారు.
గ్రామస్థులు ప్లాస్టిక్ వ్యర్థాలను డ్రైనేజీల్లో వేయవద్దని కలెక్టర్ సూచించారు. పరిసరాల పరిశుభ్రతను కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. అనంతరం స్థానిక పాఠశాలను సందర్శించిన కలెక్టర్ కిచెన్ షెడ్ అంచనాలపై ఆరా తీశారు. ఆశా కార్యకర్తలను కలిసి చిన్నారుల వ్యాక్సినేషన్ పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులతో ఆప్యాయంగా మాట్లాడి వారి చదువు తీరును తెలుసుకున్నారు. కలెక్టర్ స్వయంగా గ్రామానికి వచ్చి తమ సమస్యలను తెలుసుకుని పరిష్కరిస్తుండటంపై లోక్యతండ గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు. ఈ పర్యటనలో ఆర్డీవో రమణారెడ్డి, తహసిల్దార్ జి. ప్రమీల, ఎంపీడీవో విజయకుమారి, సర్పంచ్ జ్యోతికాంతారావు, పంచాయతీ కార్యదర్శి నాగరాజు, నాయకులు శ్రీనివాస్ నాయక్, కాంతారావు తదితరులు పాల్గొన్నారు.

