కలం, మెదక్ బ్యూరో: ఉమ్మడి మెదక్ జిల్లాలో నిషేధిత ఆస్తుల జాబితా 22A అంశం దుమారం రేపుతోంది. అనేక ప్రాంతాలు రాజధాని హైదరాబాద్, ఔటర్ రింగు రోడ్డు చుట్టుపక్కల ఎక్కువగా ఉన్నాయి. దీనికితోడు వేగంగా రియల్ ఎస్టేట్ రంగం విస్తరిస్తుండటంతో కొత్తగా 22A ప్రభావం జిల్లా ప్రజలపై పడుతుంది. రికార్డులో లోపాలు, అధికారుల వర్గీకరణ పొరపాట్లు సామాన్యుల పాలిట శాపంగా మారింది.
నిషేధిత జాబితాలో వేలాది ఎకరాలు
ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలోని సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లాలో వేలాది ఎకరాల ప్రభుత్వ భూములున్నాయి. ప్రభుత్వ అసైన్డ్, సీలింగ్ భూములు, అటవీ భూములు, దేవదాయ భూములు పలు ప్రాంతాల్లో అన్యాకాంత్రమవుతున్నాయి. ఈ భూములు అన్యాక్రాంతం కాకుండా కాపాడేందుకు 22A తీసుకువచ్చింది. దీంతో ప్రభుత్వ ఇనాం, అటవీ , అసైన్డ్, ఇతర భూములకు చిక్కులు ఏర్పడ్డాయి. అటవీ సరిహద్దుల వద్ద పట్టా భూములను పొరపాటున 22A లో చేర్చారు. దీంతో గ్రామీణ రైతులు లబోదిబోమంటున్నారు. బ్యాంకు రుణాలు తీసుకుని ప్లాట్లు, ఇండ్లు కొనుగోలు చేసిన సామాన్యులు, ఉద్యోగులు రిజిస్ట్రేషన్లు కాక, ఆస్తులపై హక్కులు లేక అయోమయంలో పడ్డారు. భూములు, ప్లాట్లు ఉన్నప్పటికీ, పిల్లల చదువులు, పెళ్లిళ్లు, వైద్యం కోసం అమ్ముకోలేకపోతున్నారు.
రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులను ప్రారంభించిన డెవలపర్లు, బిల్డర్లు కొనుగోలుదారులకు సమాధానం చెప్పుకోలేని పరిస్థితి ఏర్పడింది. బ్యాంకుల నుంచి వచ్చే నోటీసులతో వ్యాపారాలు నిలిచిపోయి తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నారు. అలాగే హైదరాబాద్కు సమీపంలో ఉన్న పటాన్చెరు, రామచంద్రాపురం, అమీన్పూర్, గుమ్మడిదల, సంగారెడ్డి, కంది, కొండాపూర్ తదితర ప్రాంతాల్లో రూ.వేల కోట్ల విలువైన ప్రైవేట్ ఆస్తులు 22A ఉచ్చులో చిక్కుకున్నాయి. ఔటర్ రింగు రోడ్డుకు దగ్గరలో ఎన్నో భూములు నిషేధిత జాబితాలో చేరాయి. ముఖ్యంగా విస్తరణ భాగంగా హైదరాబాద్లో కలిసిన పటాన్చెరు నియోజకవర్గంలో రూ.1000 కోట్లకుపైగా ప్రైవేట్ ఆస్తులను నిషేధిత జాబితాలో చేర్చారు.
నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు
రామచంద్రాపురం రూ.కోట్ల విలువ చేసే వ్యవసాయేతర భూమి 22-A కిందకి వెళ్లింది. అమీన్పూర్, బీరంగూడ ప్రాంతాల్లో సుమారు 250-300 ఎకరాల వ్యవసాయేతర, 300 ఎకరాల వ్యవసాయ భూములు జాబితాలో ఉన్నాయి. HMDA అనుమతులతో ఏర్పాటైన పలు కాలనీలు, గెటేడ్ కమ్యూనిటీల్లో వెంచర్లు, విల్లాలు, అపార్ట్మెంట్లు, ప్లాట్స్ రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. ఇక గుమ్మడిదల మండలంలోని సర్వే నం. 199లోని 6 ఎకరాల్లోని ఇండ్లు ప్రకృతివనం కాలనీ, సర్వే నం. 261, 261/4లోని 15 ఎకరాల భూమి, అనంతారంలో 100 ఎకరాలకుపైగా వ్యవసాయ భూములు 22-A లో చేరాయి. దీంతోపాటు ముంబాయి జాతీయ రహదారిని అనుకొని, జిల్లా కేంద్రంగా ఉన్న సంగారెడ్డి, కంది మండలంలో 200 ఎకరాలకుపైగా వ్యవసాయేతర భూమితో పాటు రెండు మండలాల్లో వందల కోట్ల విలువైన ప్రైవేట్ ఆస్తులు నిలిచిపోయాయి.
అఫీసుల చుట్టు ప్రదక్షిణలు
బహుళ అంతస్తుల అపార్ట్మెంట్లు, ఓపెన్ ప్లాట్లను కూడా నిషేధిత జాబితాలోకి నెట్టడంతో రియల్ ఎస్టేట్ రంగం తీవ్రంగా దెబ్బతింది. ఇంకా చాలమందికి భూములు 22-Aలో చేరాయా? లేదా? అనే విషయం తెలియడం లేదు. ఈ జాబితా నుంచి తమ పేరును తొలగించుకోవడానికి NOC కోసం బాధిత యజమానులు కలెక్టరేట్, ఆర్డీవో, తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోంది. అందుకోసం పాత పహాణీలు, లింక్ డాక్యుమెంట్లు, సేత్వార్, పట్టాదారు పాస్బుక్ లాంటి పూర్తి ఆధారాలను కలెక్టర్, రెవెన్యూ అధికారులకు కలిసే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రజల నుంచి వస్తున్న అభ్యంతరాలను తొలగించి, వెంటనే పరిష్కారమార్గం చూపించాల్సిన బాధ్యత ప్రభుత్వం, రెవెన్యూ యంత్రాగం మీద ఉంది.

