కలం, యాదగిరిగుట్ట: శ్రావణ మాసం సందర్భంగా యాదగిరిగుట్ట (Yadagirigutta) శ్రీ లక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయంలో శుక్రవారం సామూహిక వరలక్ష్మీ వ్రతాలను (Varalakshmi Vratam) ఘనంగా నిర్వహించారు. కొండకింద ఉన్న రెండో హాల్‌లోని సత్యనారాయణస్వామి వ్రత మండపంలో ఉదయం 11 గంటలకు వేడుకలు ప్రారంభమయ్యాయి. ముత్తైదువులు లక్ష్మీ అమ్మవారిని దివ్యమనోహరంగా అలంకరించి భక్తిశ్రద్ధలతో వరలక్ష్మీ వ్రతాలను ఆచరించారు. భక్తుల సౌకర్యార్థం ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వ్రతంలో పాల్గొనే మహిళలకు దేవస్థానం తరఫున వ్రత పీఠం, కలశాలతో పాటు చీర, రవికె, పూలు, గాజులు, వ్రతానికి అవసరమైన సామగ్రిని ఉచితంగా అందజేశారు.
హిందూ సంప్రదాయంలో శ్రావణ మాసానికి ఎంతో విశిష్టత ఉందని ఆలయ అధికారులు తెలిపారు. ముఖ్యంగా శ్రావణ శుక్రవారాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుందని పేర్కొన్నారు. పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నిర్వహించే వరలక్ష్మీ వ్రతం (Varalakshmi Vratam) అత్యంత పవిత్రమైనదని తెలిపారు. వరలక్ష్మీ దేవిని పూజించడం ద్వారా అష్టలక్ష్ములను పూజించిన ఫలితం లభిస్తుందని భక్తుల విశ్వాసమని వివరించారు.
ధాన్యలక్ష్మీ, ధైర్యలక్ష్మీ, సంతానలక్ష్మీ, విజయలక్ష్మీ, విద్యాలక్ష్మీ, ధనలక్ష్మీ, గజలక్ష్మీ, సౌభాగ్యలక్ష్మీ రూపాలలో అమ్మవారి కృప లభిస్తుందని తెలిపారు. కుటుంబాలలో సుఖసంతోషాలు, అష్టైశ్వర్యాలు, ధనధాన్యాలు వెల్లివిరియాలని కోరుకుంటూ వివాహిత మహిళలు వరలక్ష్మీ వ్రతాన్ని భక్తిశ్రద్ధలతో ఆచరిస్తారని పేర్కొన్నారు. భర్తల ఆయురారోగ్యాలు, కుటుంబ శ్రేయస్సు, సౌభాగ్యం కోసం అమ్మవారిని ప్రార్థించారు.
Also Read : ‘చక్కెర ధరలపై కేంద్రం కీలక నిర్ణయం
Follow Us On: X(Twitter)

