‘సర్’ ఎఫెక్ట్.. పొలిటికల్ స్టూడెంట్స్ ఓట్లు గల్లంతు..!

కలం, తెలంగాణ బ్యూరో : హైదరాబాద్, దాని పరిసరాల్లో రాజకీయ నాయకుల కాలేజీలు కోకొల్లలు. ముఖ్యంగా ఇంజనీరింగ్ కాలేజీలకైతే పెట్టింది పేరు. వాటిలో చదివేందుకు ఏటా పల్లెల నుంచి కొత్త స్టూడెంట్లు వచ్చి అడ్మిషన్లు తీసుకుంటూ ఉంటారు. స్థానికంగా హాస్టళ్లలో ఉంటూ చదువు కొనసాగిస్తుంటారు. ఎన్నికల సీజన్ వచ్చిందంటే చాలు ఆ లీడర్లకు పండుగ. తమ విద్యాసంస్థల్లో చదువుతున్న స్టూడెంట్లకు నయానో భయానో చెప్పి హాస్టల్స్ అడ్రస్తోనే ఓటు హక్కు వచ్చేలా ప్లాన్ చేస్తుంటారు. స్థానిక నియోజకవర్గాల్లో పోటీ చేసి.. ఆ స్టూడెంట్ల ఓటు బ్యాంకుతో గెలవాలన్నది లీడర్ల వ్యూహం! ప్రతీ అసెంబ్లీ, జీహెచ్ఎంసీ, గ్రాడ్యుయేట్ ఎన్నికలప్పుడు ఈ సీన్ కనిపిస్తూ ఉంటుంది. అయితే.. ఇప్పుడు ‘సర్’ ఎఫెక్ట్ (SIR Effect) తో ఆ స్టూడెంట్ల ఓట్లన్నీ గల్లంతయ్యాయి.

విద్యాసంస్థల పరిసరాల్లోని హాస్టళ్ల చిరునామాతో ఉండాల్సిన ఓట్లు ‘అనామలీస్’ పేరుతో డిలీట్ అయ్యాయి. సొంత ఊరిలో ఓటు ఉంచుకొని.. ఇక్కడ ఓటును విద్యార్థులు స్వచ్ఛందంగా తొలగించుకున్నారు. ఇలా హైదరాబాద్ పరిసరాల్లోనే లక్షల్లో స్టూడెంట్ల ఓట్లు షిఫ్ట్ అయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటివి చాలానే ఉన్నాయి. ఎన్నికలప్పుడు ప్రత్యేక వ్యూహంతో స్టూడెంట్లను ఓటర్లుగా చేర్పించిన విద్యాసంస్థల అధినేతలు కమ్ పొలిటికల్ లీడర్లు.. ‘సర్’ ప్రక్రియలో మాత్రం ఆ ఓట్లపై దృష్టిపెట్టలేదు. ఇప్పుడు తమకు అనుకూలమైన స్టూడెంట్ల ఓట్లు వెళ్లిపోవడంతో వచ్చే ఎన్నికల్లో తీవ్ర ప్రభావం పడుతుందని ఇప్పటి నుంచే సదరు నేతలు లెక్కలు వేసుకుంటూ తలలు పట్టుకుంటున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా ‘సర్’ ముగిసిన తర్వాత 73 లక్షల ఓటర్ల పేర్లు డ్రాఫ్ట్ లిస్ట్ నుంచి డిలీట్ కావడం అన్ని రాజకీయ పార్టీలను ఉలిక్కిపడేలా చేసింది. చనిపోయినవారు, పర్మినెంట్‌గా షిప్ట్ అయినవారు, అడ్రస్‌లో నివసించనివారు, డబుల్ ఎంట్రీస్.. ఇలాంటివన్నీ ఫిల్టర్ అయ్యాయని సీఈవో కార్యాలయం చెప్తున్నా పొలిటీషియన్లకు మాత్రం మరో రకమైన ఆందోళన ఉన్నది. గతంలో ఎన్నికల సందర్భంగా, ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిసరాల్లో ఓటర్ల జాబితాలో చేర్పించిన విద్యార్థులంతా ‘సర్’ పేరుతో డిలీట్ అయ్యారనే కలవరం వారిలో నెలకొన్నది. సొంత కాలేజీలున్న రాజకీయ నాయకులు అందులో చదువుతున్న విద్యార్థులను స్థానిక కాలేజీ పరిసరాల్లోని అడ్రస్‌తోనే లిస్టులో ఓటర్లుగా చేర్పించారు. ఎన్నికల్లో ఓటు బ్యాంకు కోసం ఈ ప్రయత్నాలు చేసిన నేతలు.. ఇప్పుడు ఎన్నికలు లేకపోవడంతో ‘సర్’ సందర్భంగా వారిని ఇక్కడే కంటిన్యూ అయ్యేలా చొరవ తీసుకోలేదు. ఫలితంగా వారంతా సొంత ఊరిలోకి ట్రాన్స్‌ఫర్ చేసుకున్నారు. దీంతో ఇక్కడి లిస్టులో వీరి పేర్లు గల్లంతయ్యాయి.

అప్పట్లోనే వివాదాలు

రాష్ట్ర రాజధాని హైదరాబాద్ పరిసరాల్లోని కాలేజీల్లో చదవడానికి వచ్చే విద్యార్థులు ఎక్కువగా హాస్టళ్లలో ఉంటుంటారు. ఆయా అడ్రస్లతోనే వారిని లోకల్ నియోజకవర్గంలో ఓటర్లుగా పలువురు నాయకులు చేర్పించారు. ఈ నాయకుల్లో చాలా మంది ఆయా కాలేజీలకు యజమానులు కావడంతో విద్యార్థులు కూడా స్థానికంగా ఓటు వస్తుందని లిస్టులో చేరిపోయారు.

ప్రతీ అసెంబ్లీ, జీహెచ్ఎంసీ, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఇలా విద్యార్థులను ఓటర్లుగా చేర్పించడం విద్యాసంస్థల అధినేతలు కమ్ లీడర్ల రెగ్యులర్ ప్రాక్టీస్. ఓటర్లుగా ఫామ్-6 ద్వారా చేర్పించే టైమ్‌లో వారి అర్హతను ప్రామాణికంగా తీసుకుని ఈర్వోలు సైతం ఆమోదం తెలిపేవారు. అడ్రస్ విషయంలో ఎన్నికల నిబంధనల్లో ఉన్న వెసులుబాటుతో తాత్కాలిక అడ్రస్‌గా హాస్టళ్లను పేర్కొనేవారు.

అయితే.. ‘సర్’ ప్రక్రియలో రెసిడెన్స్, ఇతర ఆధారాలు తప్పనిసరి కావడంతో డబుల్ ఎంట్రీ లేదా వివరాల్లో తేడాలతో చాలా మంది పేర్లు అర్హత లేనివిగా తేలినట్లు సీఈవో వర్గాల సమాచారం. ఖమ్మం టౌన్‌లో మమతా కాలేజీల్లో చదువుతున్న విద్యార్థులను బోగస్ చిరునామాతో చేర్పించారంటూ గతంలో పువ్వాడ అజయ్‌పై ఆరోపణలు వచ్చాయి. హైదరాబాద్లో బీఆర్ఎస్ నేత మల్లారెడ్డి, ఆయన అల్లుడికి చెందిన విద్యా సంస్థల్లో చదివే విద్యార్థులను, పేరెంట్స్ను కూడా ఇదే తరహాలో చేర్పించినట్లు ఆరోపణలు వచ్చాయి.

హాస్టళ్ల అడ్రస్‌లతో భారీగా ఓట్లు!

గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా హాస్టళ్ల పేరుతో భారీ సంఖ్యలో ఓటర్లుగా లోకల్ జాబితాలో నమోదైనట్లు ఆరోపణలు వచ్చాయి. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని యూసుఫ్‌గూడలో ఒక బాయ్స్ హాస్టల్ అడ్రస్‌తో 20 మంది మహిళలు సహా మొత్తం 103 మంది ఓటర్లు నమోదైనట్లు సీఈవోకు ఫిర్యాదులు అందాయి. హాస్టల్‌లో 60 మంది మాత్రమే ఉన్నారని, మహిళలే లేరని హాస్టల్ సిబ్బంది వివరించారు. పక్కనే ఉన్న మరో భవనానికి 50 మంది ఓటర్లు నమోదై ఉన్నా, అక్కడి నివాసులకు ఆ పేర్ల గురించి తెలియదని తేలింది.

సీఈవో కార్యాలయం, జీహెచ్ఎంసీ ఎలక్షన్ ఆఫీసర్ ఫీల్డ్ రిపోర్ట్ తెప్పించుకున్నారు. ఖమ్మం జిల్లాలో పువ్వాడ అజయ్‌కు చెందిన మమతా విద్యా సంస్థల్లోనూ ఇదే తరహా అంశం వెలుగులోకి వచ్చింది. ఒకే అడ్రస్‌లో (20వ వార్డు) 2014లో 453 మంది ఓటర్లు ఉంటే, 2018 ఎన్నికల నాటికి అది 657కు చేరుకుందని, 2019 పార్లమెంట్ ఎన్నికల టైమ్‌లో అది 561 ఓటర్లుగా, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నాటికి 532 ఓటర్లుగా మారిందని ఆర్టీఐ దరఖాస్తు ద్వారా వెలుగులోకి వచ్చింది. ఈ అడ్రస్‌లోనే పువ్వాడ అజయ్, ఆయన భార్య పేర్లు కూడా జాబితాలో ఉన్నట్లు నిర్ధారణ అయింది.

పొలిటీషియన్ల కాలేజీల్లోనే ఇలాంటివి ఎక్కువ

రాజకీయ నాయకులకు కాలేజీలు ఉన్న చోట ఇలాంటి ఓటర్లు ఉన్నారన్నది సీఈవో ఆఫీస్ వర్గాల సమాచారం. ఇప్పుడు ‘సర్’ జరగడంతోనే ఇవన్నీ బయటకు వచ్చాయన్నది వారి అభిప్రాయం. నల్లగొండ-వరంగల్-ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా 2021లో పల్లా రాజేశ్వర్ రెడ్డి పోటీ చేసినప్పుడు ఆయనకు చెందిన అనురాగ్ విద్యా సంస్థల్లో చదివే విద్యార్థులను ఓటర్లుగా చేర్పించారని, ఆ తర్వాత 2023 అసెంబ్లీ ఎన్నికల్లో గెలవడంతో ఎమ్మెల్సీ స్థానాన్ని వదులుకున్నారని, 2024 మే నెలలో జరిగిన అదే ఎమ్మెల్సీ స్థానం ఉప ఎన్నికల్లో గ్రాడ్యుయేట్ విద్యార్థుల పేర్లు దాదాపు 45 వేలకు పైగా తగ్గిపోయాయనే చర్చ జరిగింది.

రాజకీయ నాయకులు వారి అవసరాల కోసం విద్యార్థులను తాత్కాలిక అడ్రస్‌లతో ఓటర్లుగా చేర్పించడం, ఎన్నికలు అయిపోయిన తర్వాత దాని గురించి పట్టించుకోకపోవడం రొటీన్‌గా జరుగుతున్న ప్రాక్టీస్. ఇప్పుడు ‘సర్’ తర్వాత అలాంటి ఓటర్ల సంఖ్య గణనీయంగా తగ్గుతున్నదని, సొంతూళ్లలో ఉంచుకోవడంతో డబుల్ ఎంట్రీస్ తగ్గిపోయి ఉండొచ్చన్నది సీఈవో వర్గాల అభిప్రాయం.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>