కలం, వెబ్ డెస్క్ : ముంబై (Mumbai Bus Fire)లోని సియాన్ సమీపంలో ఉన్న బృహన్ముంబై ఎలక్ట్రిక్ సప్లై అండ్ ట్రాన్స్‌పోర్ట్ (BEST) అనిక్ డిపోలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. డిపో ఆవరణలో పార్క్ చేసి ఉంచిన 12 నూతన ఏసీ సీఎన్‌జీ బస్సులు ఒక్కసారిగా మంటల్లో చిక్కుకుని పూర్తిగా దగ్ధమయ్యాయి. అయితే ఈ ప్రమాదం సమయంలో బస్సుల్లో ప్రయాణికులు గానీ, సిబ్బంది గానీ ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని, ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు.
అయితే ప్రమాదం ధాటికి బస్సులలోని సీఎన్‌జీ సిలిండర్లు ఒకదాని తర్వాత ఒకటి పేలిపోవడంతో డిపో పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున శబ్దాలు వస్తూ దట్టమైన నల్లటి పొగ ఆవరించింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని పలు ఫైర్ ఇంజిన్ల సహాయంతో తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి.
బెస్ట్ (BEST) అధికారుల సమాచారం ప్రకారం.. ఈ బస్సులను ప్రైవేట్ లీజ్ ఆపరేటర్ ‘దాగా గ్రూప్’ నిర్వహిస్తోంది. కొత్తగా అందుబాటులోకి వచ్చిన ఈ బస్సులను డిపో యార్డ్‌లో చాలా దగ్గరదగ్గరగా పార్క్ చేసి ఉంచడం వల్ల మంటలు అత్యంత వేగంగా ఒక బస్సు నుంచి మరో బస్సుకు వ్యాపించాయని తెలుస్తోంది. ప్రమాదానికి గల అసలు కారణాలను తెలుసుకునేందుకు అధికారులు ప్రత్యేక విచారణకు ఆదేశించారు.

