కలం, మహబూబ్ నగర్ బ్యూరో : పాడి రైతుల సంక్షేమం, ఆర్థిక అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని విజయ డైరీ పాల కొనుగోలు ధరలను పెంచిందని, పెంచిన ధరలను పాడి రైతులు సద్వినియోగం చేసుకొని విజయ డైరీ పాల సేకరణ కేంద్రాల్లో పాలు విక్రయించి ఆర్థికంగా లబ్ధి పొందాలని జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా (Khushboo Gupta) సూచించారు. గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో తన ఛాంబర్ లో విజయ డైరీ పాడి రైతులకు పెంచిన పాల కొనుగోలు ధరలకు సంబంధించిన కరపత్రాన్ని జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా విజయ డైరీ డిప్యూటీ డైరెక్టర్, డైరీ డెవలప్‌మెంట్ డి. సత్యనారాయణ యాదవ్ మాట్లాడుతూ, విజయ డైరీ గేదె పాల కొనుగోలు ధరను లీటరుకు రూ.6, ఆవు పాల కొనుగోలు ధరను లీటరుకు రూ.2 చొప్పున పెంచినట్లు తెలిపారు. పెంచిన ధరలు 16.08.2026 నుంచి అమల్లోకి వచ్చినట్లు వెల్లడించారు. పాడి రైతులకు గిట్టుబాటు ధరతో పాటు ప్రతి 15 రోజులకు పాల బిల్లుల చెల్లింపు, పాడి పశువులకు బీమా సౌకర్యం, తక్కువ ధరకే నాణ్యమైన పశుదాణా, పశుపోషణకు అవసరమైన కాల్షియం, మినరల్ మిక్చర్, నట్టల నివారణ మందులు, గడ్డి విత్తనాలను విజయ డైరీ ద్వారా అందిస్తున్నట్లు డీడీ తెలిపారు.
అదేవిధంగా పాడి పశువుల కొనుగోలుకు యూనియన్ బ్యాంక్, తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ద్వారా రుణ సదుపాయం కల్పిస్తున్నట్లు తెలిపారు. పాడి రైతులు ఈ సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పాడి రైతులు మధ్యవర్తులు, ఇతర ప్రైవేటు డైరీలకు పాలు విక్రయించి నష్టపోకుండా విజయ డైరీ పాల సేకరణ కేంద్రాల్లోనే పాలు విక్రయించాలని, తద్వారా పెంచిన పాల ధరలతో పాటు విజయ డైరీ అందిస్తున్న ఇతర సదుపాయాలను సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా లబ్ధి పొందాలని డీడీ సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పశు సంవర్థక శాఖ అధికారి డాక్టర్ శివానంద స్వామి, డీఆర్డీవో నర్సింహులు, డైరీ మేనేజర్ యాకన్న తదితరులు పాల్గొన్నారు.

