కలం, వనపర్తి: ఎల్నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో వర్షపు నీటిని సంరక్షించి భూగర్భ జలాలను పెంపొందించేందుకు ఉపాధి హామీ పథకం కింద ఫారం పాండ్లు, బోర్వెల్ రీచార్జ్ పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి (Adarsh Surabhi) అధికారులను ఆదేశించారు. గురువారం జిల్లా కలెక్టరేట్ నుంచి అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) ఖీమ్య నాయక్తో కలిసి ఎంపీడీవోలు, పంచాయతీ కార్యదర్శులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పలు అభివృద్ధి పనులపై సమీక్షించారు.
ప్రతి గ్రామంలో అర్హత, ఆసక్తి ఉన్న రైతులను గుర్తించి నిర్దేశించిన లక్ష్యాలను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని సూచించారు. మండలాల వారీగా లక్ష్యాలను విభజించి, గ్రామ పంచాయతీలకు కేటాయించిన ఫారం పాండ్ల నిర్మాణాలను పంచాయతీ కార్యదర్శుల సమన్వయంతో వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు.
670 మంది అర్హుల గుర్తింపు
ఇందిరమ్మ ఇళ్లపై సమీక్షించిన కలెక్టర్.. జిల్లాలో గుడిసెల్లో నివసిస్తున్న కుటుంబాల సర్వేలో 670 మంది అర్హులను గుర్తించినట్లు తెలిపారు. కొన్ని గుడిసెలకు సంబంధించిన చెక్లిస్టులు ఇప్పటికే అందాయని, వాటిని పరిశీలించి ఇళ్ల మంజూరు ప్రక్రియ చేపడుతున్నట్లు చెప్పారు. మరో 308 గుడిసెలకు చెక్లిస్టులు సమర్పించాల్సి ఉందని, సంబంధిత ఎంపీడీవోలు వాటిని త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు.
పెండింగ్లో ఉన్న రెండు పడక గదుల ఇళ్లకు అర్హులైన లబ్ధిదారులను గుర్తించి కేటాయింపు ప్రక్రియ పూర్తి చేయాలని సూచించారు. అన్ని గ్రామాల్లో పైకప్పుల మార్పిడికి అర్హులైన వారి జాబితాలను సేకరించి వెంటనే సమర్పించాలని, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో జడ్పీ సీఈవో యాదయ్య, డిప్యూటీ సీఈవో రామ మహేశ్వర్, డీపీవో రఘునాథ్ తదితరులు పాల్గొన్నారు.

