కలం, వెబ్ డెస్క్: ఢిల్లీలో ఇటీవల కాక్రోచ్ జనతా పార్టీ నిర్వహించిన ఆందోళనల సందర్భంగా విద్యార్థులపై పోలీసులు, పారా మిలటరీ బలగాలు దాడికి పాల్పడ్డాయనే ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనను విచారించేందుకు అయిదుగురితో సుప్రీం కోర్టు (Supreme Court) ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేసింది. దీనికి అధ్యక్షుడిగా మాజీ సుప్రీం కోర్టు జడ్జి, తెలంగాణకు చెందిన జస్టిస్ ఆర్.సుభాష్ రెడ్డి వ్యవహరించనున్నారు. జస్టిస్ రవిశంకర్ జా, జస్టిస్ శైలిందర్ కౌర్, జస్టిస్ రిషి కుమార్ శుక్లా, మేఘాలయ మాజీ డీజీపీ ఎల్.ఆర్.బిష్ణోయ్ సభ్యులుగా ఉండనున్నారు.
ఇరు వైపులా వాదనలు విని..
ఆందోళనల సందర్భంగా రెండు రకాల వాదనలు సుప్రీం కోర్టుకు ముందుకు వచ్చాయి. పోలీసులు తమను తీవ్రంగా కొట్టారని, పెల్లెట్ గన్స్ సైతం ఉపయోగించారని విద్యార్థులు ఆరోపించారు. మానవత్వం మరిచి ఈడ్చి పారేశారని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు తమపైనే ఆందోళనకారులు దాడి చేశారని.. పలువురు సిబ్బందికి తీవ్ర గాయాలైనట్లు పోలీసులు వివరించారు. ఈ నేపథ్యంలో ఇరు వైపులా వాదనలు విని.. అసలు కారణాలను అన్వేషించి, నివేదిక రూపంలో తమకు అందించాలని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ కమిటీని ఆదేశించారు.

