కలం, స్పోర్ట్స్: ఢిల్లీ కాలుష్యంపై బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ కీలక స్పందన ఇచ్చింది. 2027 ఇండియా ఓపెన్‌ను ఫిబ్రవరిలో ఢిల్లీలోనే నిర్వహించనున్నారు. ఆ సమయంలో కాలుష్యం పెరిగే అవకాశం ఉండటంపై చర్చ కొనసాగుతోంది. (BWF) జనరల్ సెక్రటరీ థామస్ లండ్ దీనిపై స్పందించారు. టోర్నీని పూర్తిగా మొదటి త్రైమాసికం నుంచి మార్చడం ప్రస్తుతం సాధ్యం కాలేదని తెలిపారు. జనవరి, ఫిబ్రవరిలో కాలుష్యం కొంత తగ్గుతుందని ఉన్న డేటాను పరిశీలిస్తున్నామని చెప్పారు. ఈ ఏడాదితో పోలిస్తే పరిస్థితులు మెరుగ్గా ఉండొచ్చని తెలిపారు. దేశీయ షెడ్యూల్ కారణంగా టోర్నీని పూర్తిగా వేరే సమయంలోకి మార్చలేకపోయామని వివరించారు. భవిష్యత్తులో షెడ్యూల్‌ను మరింత మెరుగుపరిచేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు.
15 పాయింట్ల ఫార్మాట్
2027 జనవరి 4 నుంచి బ్యాడ్మింటన్‌లో కొత్త 15 పాయింట్ల ఫార్మాట్ అమల్లోకి రానుంది. ప్రస్తుతం ఉన్న 21 పాయింట్ల విధానం స్థానంలో ఇది రానుంది. ఆటగాళ్లపై శారీరక భారం తగ్గించడమే ప్రధాన ఉద్దేశమని లండ్ తెలిపారు. తొలి రౌండ్ నుంచే పోటీ తీవ్రంగా మారిందని చెప్పారు. కొత్త విధానంతో ఆటగాళ్లు ఎక్కువగా గాయపడకుండా చూడాలని BWF భావిస్తోందన్నారు. మార్పుపై ఆటగాళ్లు, కోచ్‌లకు కొంత ఆందోళన ఉన్నా.. వారు త్వరగా అలవాటు పడతారని పేర్కొన్నారు. గణాంకాల ఆధారంగా చూస్తే పెద్ద మార్పు ఉండకపోవచ్చని తెలిపారు. అయితే మరిన్ని మ్యాచ్‌లు హోరాహోరీగా సాగే అవకాశం ఉందన్నారు.
టెక్నాలజీపై దృష్టి
అన్ని కోర్టుల్లో ఎలక్ట్రానిక్ లైన్ కాలింగ్ తీసుకురావాలన్న ఆటగాళ్ల డిమాండ్‌పై కూడా BWF స్పందించింది. కొత్త టెక్నాలజీలపై ఇప్పటికే పని జరుగుతోందని లండ్ తెలిపారు. ఆటగాళ్లు, అంపైర్లు, ప్రేక్షకులకు ఉపయోగపడే కొత్త మార్పులు రానున్నాయని చెప్పారు. బ్యాడ్మింటన్‌కు భారత్ అత్యంత కీలక మార్కెట్‌గా మారుతోందని లండ్ తెలిపారు. ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న బ్యాడ్మింటన్ మార్కెట్లలో భారత్ ఒకటని చెప్పారు. భారత్‌లో క్రికెట్‌కు ఉన్న స్థాయికి బ్యాడ్మింటన్‌ను తీసుకెళ్లేందుకు ఇంకా దూరం ఉందని పేర్కొన్నారు. అయితే ఆ దిశగా ముందుకు వెళ్తున్నామని తెలిపారు.
వరల్డ్ ఛాంపియన్‌షిప్ వేదికపై ప్రశంసలు
ఢిల్లీలో జరుగుతున్న ప్రస్తుత వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఏర్పాట్లపై లండ్ సంతృప్తి వ్యక్తం చేశారు. టోర్నీకి ముందు వేదికపై కొన్ని విమర్శలు వచ్చాయని గుర్తుచేశారు. అయితే తక్కువ సమయంలో చాలా పనులు పూర్తయ్యాయని తెలిపారు. ఇందుకు BAI, ప్రభుత్వం, నిర్వాహకులను అభినందించారు. సింథటిక్ ఫెదర్ షటిల్‌కాక్స్‌పై కూడా BWF దృష్టి పెట్టింది. సహజ ఈకల షటిల్‌కాక్స్‌కు ప్రత్యామ్నాయంగా వీటిని అభివృద్ధి చేస్తున్నారు.
ప్రస్తుతం టాప్ స్థాయి పోటీలకు సహజ ఈకల షటిల్‌కాక్స్ సరఫరా అందుబాటులో ఉందని లండ్ తెలిపారు. అయితే ధరలు, సరఫరాలో మార్పులు వస్తున్న నేపథ్యంలో సింథటిక్ షటిల్‌కాక్స్‌కు భవిష్యత్తులో ప్రాధాన్యం పెరగొచ్చని చెప్పారు. అయితే వరల్డ్ ఛాంపియన్‌షిప్ వంటి పెద్ద టోర్నీల్లో ఉపయోగించాలంటే అవి అత్యున్నత ప్రమాణాలు అందుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. BWF ప్రస్తుతం ఆటగాళ్ల ఆరోగ్యం, టెక్నాలజీ, ప్రసారాలు, టోర్నీల నిర్వహణపై దీర్ఘకాలిక మార్పులపై దృష్టి పెట్టినట్లు లండ్ వివరించారు.

