కలం, కరీంనగర్: కార్పొరేషన్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా గురువారం కరీంనగర్ (Karimnagar)లోని రాజీవ్ చౌక్ లో గల ఆయన విగ్రహానికి చొప్పదండి ఎమ్మెల్యే, కరీంనగర్ డీసీసీ అధ్యక్షులు డా. మేడిపల్లి సత్యం (Medipally Sathyam) నివాళులు అర్పించారు. ఆయనతో పాటు కార్పొరేషన్ కాంగ్రెస్ అధ్యక్షులు వైద్యుల అంజన్ కుమార్, కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జ్ వెలిచాల రాజేందర్ రావు, పలువురు నాయకులతో కలిసి పూలమాల సమర్పించి ఘనంగా నివాళులు అర్పించారు.
అనంతరం టీపీసీసీ ఆదేశాల మేరకు రాజీవ్ గాంధీ స్ఫూర్తితో ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా 18 ఏళ్లు నిండిన యువతకు కొత్త ఓటర్ నమోదు, ఫారం-6 నింపే కార్యక్రమంలో భాగంగా 18 సంవత్సరాలు నిండిన యువతకు నూతన ఓటరు నమోదు ఫారం స్వయంగా పూరించి అందజేశారు.
మేడిపల్లి సత్యం మాట్లాడుతూ.. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ హత్యానంతరం ఈ దేశం ఒక మంచి నాయకత్వం కోసం ఎదురుచూస్తున్న సమయంలో ఈ దేశాన్ని నడిపించగల సమర్థులైన నాయకులు రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి పదవి చేపట్టారని అన్నారు. దేశంలో అనేక సంస్కరణలు ప్రవేశపెట్టి ఐటీ రంగంతో పాటు టెలి కమ్యూనికేషన్ విభాగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చి నేడు ప్రతి పేదవాడు సెల్ ఫోన్, కంప్యూటర్ వినియోగించడానికి పునాదులు వేసిన గొప్ప నాయకులని పేర్కొన్నారు.
నూతన విద్యావిధానం తీసుకొచ్చారు..
నూతన విద్యా విధానం పాలసీ తీసుకువచ్చి జవహర్ నవోదయ విద్య అంకురార్పణ చేశారన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ విధానాలకు వ్యతిరేకంగా ప్రభుత్వ విధానాల్లో భాగస్వామ్యం కోరుకుంటూ జెన్ జీ ఉద్యమాలు చేస్తున్న ఈ రోజుల్లో, ఆనాడే రాజీవ్ గాంధీ చట్ట సభలకు ఎన్నికయ్యే వ్యక్తులను ఎన్నిక చేసే బాధ్యతలో యువతను భాగస్వాములను చేయాలని 61 వ రాజ్యాంగ సవరణ చేసి 21 సంవత్సరాలకు ఉన్న యువతకు 18 సంవత్సరాలకే ఓటు హక్కు కల్పించిన గొప్ప మేధావి అని కొనియాడారు.
ఆ కుటుంబం చేసిన త్యాగాలను సూర్యచంద్రులు ఉన్నంతవరకు దేశ ప్రజలు మరిచిపోరని అన్నారు. రాజీవ్ గాంధీ ఆశయాలను నెరవేర్చడానికి కట్టుబడి ఉంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో సుడా మాజీ చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, మాజీ శాసనసభ్యులు ఆరేపల్లి మోహన్, నాయకులు పురుమల్ల శ్రీనివాస్, రాచకొండ చక్రధర్ రావు, ఏఎంసీ చైర్మన్ ఆకుల నరసయ్య, తదితరులు పాల్గొన్నారు.

