కలం, నల్లగొండ: వ్యవసాయ రంగానికి నాణ్యమైన ఉచిత విద్యుత్ సరఫరా చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ నేత చిరుమర్తి లింగయ్య (Chirumarthy Lingaiah) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. లో-వోల్టేజ్ సమస్యలు, కరెంట్ కోతలతో రైతాంగం తీవ్ర నష్టపోతోందని ఆరోపిస్తూ గురువారం నల్లగొండ (Nalgonda) లోని విద్యుత్ శాఖ సూపరింటెండింగ్ ఇంజనీర్ కార్యాలయాన్ని బీఆర్‌ఎస్ శ్రేణులు, రైతులతో కలసి ఆయన ముట్టడించారు. ఈ సందర్భంగా కాలిపోయిన బోరు మోటర్లు, ఎండిపోయిన వరి చేలను చేతబూని మాజీ ఎమ్మెల్యే వినూత్న రీతిలో నిరసన తెలిపారు. విద్యుత్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించిన అనంతరం చిరుమర్తి లింగయ్య మీడియాతో మాట్లాడుతూ.. సర్కారు తీరుపై విమర్శలు గుప్పించారు.
నిరంతర లో-వోల్టేజ్ కారణంగా పొలాల్లో బోరు మోటర్లు కాలిపోతున్నాయని, విద్యుత్ కోతల వల్ల పంటలు ఎండిపోయి రైతులు కన్నీళ్లు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. లో-వోల్టేజ్ వల్ల దెబ్బతిన్న వ్యవసాయ మోటర్లకు ప్రభుత్వమే పూర్తిస్థాయిలో పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే 24 గంటల నాణ్యమైన ఉచిత కరెంట్ ఇస్తామని ఇచ్చిన హామీ ఎటు పోయిందో సమాధానం చెప్పాలని నిలదీశారు. రైతులు ఇంతటి కష్టాల్లో ఉన్నా స్థానిక జిల్లా మంత్రులకు, ప్రభుత్వానికి వారి గోడు వినిపించకపోవడం శోచనీయమన్నారు. “ఇది విద్యుత్ కొరత సమస్య కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనా వైఫల్యమే” అని స్పష్టం చేశారు. రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించకపోతే రాబోయే రోజుల్లో ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని చిరుమర్తి లింగయ్య హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గానికి చెందిన పలువురు బీఆర్‌ఎస్ నాయకులు, భారీ సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.

