కలం, కరీంనగర్: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తోందని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు (Ramchander Rao) విమర్శించారు. కరీంనగర్ జిల్లాలో నిర్వహించిన ఫీజుల బకాయి బీజేపీ లడాయి కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ సంక్షేమ ప్రభుత్వమని మాటలు చెప్తూ రాష్ట్రాన్ని సంక్షోభంలో పడేసిందని అన్నారు. ప్రజలు ఇకపై కాంగ్రెస్ మాటలు నమ్మే పరిస్థితి లేదని చెప్పారు. కాంగ్రెస్ సర్కార్ అబద్దాల కోరు అని విమర్శించారు. ఫీజు రీయింబర్స్ మెంట్, స్కాలర్ షిప్ బకాయిలతో పేద విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో ఇప్పటి వరకు రూ.12 వేల కోట్ల ఫీజు రీయింబర్ష్ మెంట్ పెండింగ్లో ఉందన్నారు. ప్రభుత్వం నిధులు చెల్లించకపోవడంతో కళాశాలలు మూత పడుతున్నాయని తెలిపారు. రేవంత్ సర్కార్ యంగ్ ఇండియా పేరుతో గురుకులాలను మూసివేసే కుట్ర చేస్తోందని ఆరోపించారు. రాహుల్ గాంధీ తెలంగాణలో విద్యా వ్యవస్థ గురించి మాట్లాడాలని డిమాండ్ చేశారు. వందే మాతరంలో రెండు చరణాలు మాత్రమే పాడాలని కాంగ్రెస్ తీర్మానం చేయడం దేశ ద్రోహమేనని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ నిర్ణయంతో బ్రిటిష్ వాళ్లకు కాంగ్రెస్ పార్టీకి ఏం తేడా లేదని స్పష్టం అవుతోందన్నారు. రాష్ట్రంలో విద్యార్థుల సమస్యలపై బీజేపీ పోరాడుతుందని స్పష్టం చేశారు. ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు చెల్లించే వరకు వెనకడుగు వేసే ప్రసక్తే లేదని తెలిపారు.

