కలం, కరీంనగర్: స్పెయిన్‌లో జరిగిన ప్రతిష్టాత్మక అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్‌లో అద్భుత ప్రతిభ కనబరిచిన కరీంనగర్‌కు చెందిన యువ చెస్ క్రీడాకారుడు శౌనక్‌ను కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ (Bandi Sanjay Kumar) ఘనంగా సన్మానించారు. కరీంనగర్‌లోని ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌లో బుధవారం ఈ అభినందన కార్యక్రమం ఘనంగా జరిగింది. జూలై 2 నుండి ఆగస్టు 1 వరకు స్పెయిన్‌లో అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్ నిర్వహించబడింది. ఈ టోర్నీలో అద్భుతంగా ఆడిన శౌనక్ 175 ఎఫ్‌ఐడీఈ రేటింగ్ పాయింట్లు సాధించారు. చిన్న వయస్సులోనే మాస్టర్ సీఎం, ఎఫ్‌ఎం టైటిల్స్ సాధించడం విశేషం.
చిన్నతనంలోనే అంతర్జాతీయ స్థాయిలో అరుదైన విజయాలు సాధించి, కరీంనగర్ కీర్తిని ఇనుమడింపజేయడం జిల్లాకే గర్వకారణమని బండి సంజయ్ కొనియాడారు. ఈ సందర్భంగా శౌనక్ తల్లిదండ్రులతో పాటు కోచ్‌లు రామరాజు, అనూప్ కుమార్‌లను ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు, శౌనక్ తల్లిదండ్రులు ప్రసాద్, అపూర్వ, జీనియస్ చెస్ అకాడమీ వ్యవస్థాపకులు కంకటి కనకయ్య, సీనియర్ కోచ్ కంకటి అనూప్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

