కలం, వెబ్ డెస్క్ : సింగరేణి కార్మికులకు భారీ శుభవార్త అందుతోంది. దీపావళి కానుకగా కార్మికులకు రూ. 1,10,250 బోనస్ (Singareni Bonus) అందనుంది. ఈ మేరకు 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను పర్ఫార్మెన్స్ లింక్డ్ రివార్డ్ (PLR) బోనస్‌గా ప్రతి అర్హత కలిగిన కార్మికుడికి రూ. 1,10,250 చెల్లించేందుకు యాజమాన్యం అంగీకారం తెలిపింది. కోల్‌కతాలో జరిగిన జాయింట్ బైపార్టైట్ కమిటీ ఫర్ ది కోల్ ఇండస్ట్రీ (JBCCI) సమావేశంలో కోల్ ఇండియా లిమిటెడ్ (CIL) చైర్మన్, సింగరేణి యాజమాన్యం మరియు గుర్తింపు పొందిన ప్రధాన కార్మిక సంఘాల (AITUC, BMS, CITU, HMS) ప్రతినిధుల మధ్య జరిగిన సమగ్ర చర్చల అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ బోనస్ సంబంధించి సింగరేణి యాజమాన్యం అధికారిక ఉత్తర్వులు, చెల్లింపు తేదీ వివరాలను వెల్లడించాల్సి ఉంది.
కాగా, ఈ నిర్ణయం ద్వారా తెలంగాణలోని బొగ్గు గని ప్రాంతాలైన గోదావరిఖని, కొత్తగూడెం, మందమర్రి, భూపాలపల్లి, శ్రీరాంపూర్, బెల్లంపల్లి తదితర డివిజన్లలో పనిచేస్తున్న సుమారు 32,000 మంది సింగరేణి ఉద్యోగులతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న కోల్ ఇండియా బొగ్గు గని కార్మికులకు లబ్ధి చేకూరనుంది. అంతేకాకుండా, గతేడాది ఏప్రిల్ నుంచి పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు కూడా నిబంధనల ప్రకారం ఈ బోనస్ చెల్లించనున్నారు. దీపావళి పండుగకు ముందే ఈ మొత్తాన్ని నేరుగా కార్మికుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేయనుండటంతో సింగరేణి బొగ్గు గని ప్రాంతాల్లో పండుగ వాతావరణం నెలకొంది.

