కలం, ఖమ్మం బ్యూరో: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో పదేళ్ల విరామం తరువాత ఎన్నికల నగారా మోగింది. దీంతో ఖమ్మం జిల్లా ఆర్టీసీ (Khammam RTC)లో కోలాహలం నెలకొంది. 2016 తర్వాత నిలిచిపోయిన గుర్తింపు సంఘాల ఎన్నికలకు కాంగ్రెస్ ప్రభుత్వం పచ్చజెండా ఊపడంతో ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలోని ఆర్టీసీ డిపోలు ఒక్కసారిగా రాజకీయ వేడితో రగిలిపోతున్నాయి. భద్రాచలం, కొత్తగూడెం, మణుగూరు, ఇల్లందు, సత్తుపల్లి, మధిర, ఖమ్మం డిపోలతో పాటు మయూరి సెంటర్‌లోని ఆర్ఎం కార్యాలయం పరిధిలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఎన్నికల సందడే కనిపిస్తోంది. ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసినా సమస్యల పరిష్కారానికి, హక్కుల పరిరక్షణకు శక్తివంతమైన వేదిక అవసరమని భావిస్తున్న 1,800 మందికి పైగా కార్మికులు ఇప్పుడు తమ నాయకుడిని ఎన్నుకునేందుకు సిద్ధమవుతున్నారు.
ఇంటింటికి వెళ్లి ఓట్ల అభ్యర్థన..
ఎన్నికల అధికారులు క్లాజ్-3, క్లాజ్-6 ప్రాతిపదికన డమ్మీ బ్యాలెట్ పేపర్లను పంపిణీ చేయడంతో డిపో గేట్ల వద్ద ప్రచార హోరు ఊపందుకుంది. కండక్టర్లు, డ్రైవర్లు, మెకానిక్‌లు, శ్రామికులు డ్యూటీలు ముగించుకుని బయటకు రాగానే నాయకులు డమ్మీ బ్యాలెట్లను చూపుతూ ఓట్లను అభ్యర్థిస్తున్నారు. డిపో గేట్ మీటింగ్‌లు, గ్యారేజ్ కౌన్సెలింగ్‌లు మాత్రమే కాకుండా, ఏకంగా కార్మికుల నివాసాలకు వెళ్లి కుటుంబ సభ్యులను ప్రసన్నం చేసుకునే స్థాయికి క్షేత్రస్థాయి ప్రచారం చేరుకుంది. రీజియన్ పరిధిలో గెలిచి గుర్తింపు సాధించాలంటే 51 శాతం ఓట్లు సాధించడం తప్పనిసరి కావడంతో, ప్రచారంలో ప్రతి ఒక్క ఓటునూ ఒడిసిపట్టుకునేందుకు నేతలు సర్వశక్తులూ ఒడ్డుతున్నారు.
సాధారణ ఎన్నికలను తలపించేలా..
ఈ సారి పోరు కేవలం సంఘాల మధ్యే కాకుండా ఆసక్తికరమైన పొత్తుల వ్యూహాలతో సాధారణ ఎన్నికలను తలపిస్తోంది. ఎస్‌డబ్ల్యూఎఫ్, టీడబ్ల్యూయూ సంఘాలు జతకట్టగా, వారికి టీఎంయూ నేత అశ్వత్థామరెడ్డితో పాటు కాంగ్రెస్ అనుబంధ ఐఎన్‌టీయూసీ మద్దతు తెలపడం ఈ కూటమి బలాన్ని పెంచింది. ఈ కూటమి రీజియన్ స్థాయిలో ‘నక్షత్రం’ గుర్తుతో, రాష్ట్ర స్థాయిలో ‘బాణం’ గుర్తుతో రేసులో నిలిచింది. మరోవైపు గత ఎన్నికల్లో తమ పట్టు నిరూపించుకున్న ఎంప్లాయీస్ యూనియన్ (ఈయూ), నేషనల్ మజ్దూర్ యూనియన్ (ఎన్‌ఎంయూ)తో కలసి రీజియన్‌లో ‘కాగడా’, రాష్ట్ర స్థాయిలో ‘బస్సు’ గుర్తులతో బరిలోకి దిగింది. దీంతో ప్రచారం మొత్తం ‘బాణం’ వర్సెస్ ‘బస్సు’, ‘నక్షత్రం’ వర్సెస్ ‘కాగడా’ అనే రీతిలో ఉత్కంఠభరితంగా మారింది.
అక్టోబర్ 17న తుది ఫలితం..
ప్రచారంలో నాయకులు కేవలం పాత విజయాలను నెమరువేసుకోవడమే కాకుండా విలీన ప్రక్రియ పూర్తిస్థాయి క్రమబద్ధీకరణ, నిలిచిపోయిన పీఆర్‌సీ బకాయిలు, డీఏల విలీనం వంటి ఆర్థికాంశాలను ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. ముఖ్యంగా మహాలక్ష్మి పథకం అమలు తర్వాత బస్సుల్లో ప్రయాణికుల రద్దీ విపరీతంగా పెరగడంతో ఏర్పడిన సిబ్బంది కొరత, పెరిగిన పనిభారం, ప్రమోషన్లు, బదిలీల్లో పారదర్శకత వంటి అంశాలు ఈ ఎన్నికల్లో ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
అక్టోబర్ 9న ఉదయం 6 గంటల నుంచే పోలింగ్ ప్రారంభం కానుంది. అదే రోజు మధ్యాహ్నం నుంచే ప్రాథమిక లెక్కింపు ప్రక్రియ మొదలవుతుంది. అక్టోబర్ 14, 15వ తేదీల్లో పోస్టల్ బ్యాలెట్ ముగిసిన వెంటనే, అక్టోబర్ 17న వెలువడే ఆఖరి ఫలితంతో ఖమ్మం ఆర్టీసీపై ఏ జెండా ఎగురుతుందో స్పష్టం కానుంది. రాబోయే రెండేళ్ల కాలపరిమితికి కార్మికుల గొంతుకగా నిలిచే ఆ గుర్తింపు సంఘం ఏదో, ‘నక్షత్రం’ మెరుస్తుందో లేకపోతే ‘కాగడా’ వెలుగులు చిమ్ముతుందో మరో కొద్ది రోజుల్లోనే తేలి పోనుంది.

