కలం, ఖమ్మం బ్యూరో: రేషన్ బియ్యాన్ని అక్రమంగా కొనుగోలు చేసి రీసైక్లింగ్ (PDS Rice Recycling) దందాకు పాల్పడుతున్న కేటుగాడిపై ఖమ్మం పోలీసులు (Khammam Police) ఉక్కుపాదం మోపారు. ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ జిల్లా వీరులపాడు మండలానికి చెందిన కాజా రామారావు (అలియాస్ జయంతి రామారావు) అనేక నేరాలకు పాల్పడుతుండటంతో పోలీసులు పీడీ యాక్ట్ నమోదు చేశారు. బుధవారం ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ వివరాలు వెల్లడించారు. రామారావు స్థానిక రేషన్ డీలర్లు, ఏజెంట్లతో చేతులు కలిపి, లబ్ధిదారుల బయోమెట్రిక్ వేలిముద్రలను దుర్వినియోగం చేస్తున్నాడు.
పేదలకు అందాల్సిన పీడీఎస్ బియ్యాన్ని తక్కువ ధరకు అక్రమంగా సేకరిస్తున్నాడు. అలాగే రీసైక్లింగ్ (PDS Rice Recycling) చేసేవాడు. ఆ బియ్యాన్ని ఇతర రాష్ట్రాల్లో బ్లాక్ మార్కెట్‌కు తరలించి సొమ్ము చేసుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల పరిధిలోని కల్లూరు, తల్లాడ, ఎర్రుపాలెం, చంద్రుగొండ పోలీస్ స్టేషన్లలో రామారావుపై ఐదు కేసులు నమోదయ్యాయి. గతంలో 2024లోనూ తల్లాడ, కల్లూరు పోలీస్ స్టేషన్ల పరిధిలో ఇలాంటి కేసులే నమోదయ్యాయి.
అతనిపై భారతీయ న్యాయ సంహిత ఎసెన్షియల్ కమాడిటీస్ యాక్ట్, తెలంగాణ పీడీఎస్ కంట్రోల్ ఆర్డర్స్ కింద కేసులు నమోదు చేశారు. గతంలో పలుమార్లు BNSS సెక్షన్ 35(3) కింద నోటీసులు జారీ చేశారు. అయినా మారకపోవడంతో పోలీసులు పీడీ యాక్ట్ నమోదు చేశారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని, హైదరాబాద్‌లోని చంచల్‌గూడ సెంట్రల్ జైలుకు తరలించారు.
Also Read : ఇండిగో వెబ్‌సైట్ క్రాష్.. ప్రయాణికులకు సమస్యలు!
Follow Us On: X(Twitter)

