కలం, వెబ్ డెస్క్ : కాంగ్రెస్ సీనియర్ నేత, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు జి. చిన్నారెడ్డి (Chinna Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. భరిస్తున్నా కాబట్టే తాను పార్టీలో ఉన్నానని… లేదంటే మరో జీవన్ రెడ్డిని అయ్యేవాడినని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌లో కొన్ని తప్పులు జరుగుతున్నాయని చెప్పారు. వనపర్తిని సర్వనాశం చేస్తున్నారని మండిపడ్డారు. తాను వనపర్తిని అభిృవద్ది చేపట్టాలనుకుంటే ఎమ్మెల్యే మేఘారెడ్డి తన వారికే పనులు ఇవ్వాలంటూ వాటిని ఆపుతున్నారని ఆరోపించారు.
నిజానికి ఎమ్మెల్యే టికెట్ చిన్నారెడ్డికే ఇవ్వాలని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, రేవంత్ రెడ్డికి చెప్పారని.. కానీ పార్టీలోని ఎన్నికల కమిటీ డబ్బులకు ఆశపడి తనకు టికెట్ ఇవ్వలేదని చిన్నారెడ్డి అన్నారు. అయిన కాంగ్రెస్‌లో మీరే సీఎం అవుతారని రేవంత్ రెడ్డికి తాను చెప్పినట్లు వెల్లడించారు. అయితే ప్రస్తుతం వనపర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్‌ను అవినీతి పార్టీగా మార్చారని, తన పనులకు అడ్డుపడుతూ.. తన కార్యకర్తలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. తాను భరిస్తున్నా కాబట్టే పార్టీలో కొనసాగుతున్నానని.. ఓపిక నశిస్తే మరో జీవన్ రెడ్డిలా మారి తిరగబడతానని హెచ్చరించారు. అంతేకాదు 48 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ నిర్మాణం కోసం కృషి చేశామని, పార్టీకి అన్యాయం చేస్తున్నవారిని బయటకు గెంటేస్తామని వార్నింగ్ ఇచ్చారు.

