నిర్లక్ష్యానికి నిలయంగా భద్రాచలం ఆస్పత్రి.. రోగులకు నిత్యం నరకం!

కలం, ఖమ్మం బ్యూరో: తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్ సరిహద్దు ప్రాంతాల ప్రజలకు అత్యవసర వైద్య సేవల కోసం ‘పెద్ద దిక్కు’గా ఉన్న భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి (Bhadrachalam Hospital) సమస్యలకు నిలయంగా మారింది. అధికారుల అలసత్వానికి, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యానికి నిలువుటద్దంగా మారింది. ప్రభుత్వం సదుద్దేశంతో 200 పడకలతో ఈ ఆస్పత్రిని ఏర్పాటు చేసినా, ప్రస్తుతం పర్యవేక్షణ కరువైంది. పారిశుధ్య లోపంతో కునారిల్లుతోంది. గతంలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, జిల్లా స్థాయి ఉన్నతాధికారులు సైతం తమ కుటుంబ సభ్యుల ప్రసవాల కోసం ఈ ఆస్పత్రిపై విశ్వాసం చూపిన చరిత్ర ఉంది. కానీ నేడు ఇక్కడి పరిస్థితులు రోగులకు నరకం చూపుతున్నాయి.

​పేద ప్రజలే కదా ఎవరు అడుగుతారులే అనే ధీమానో, అధికారుల నిర్లక్ష్యమో తెలియదు కానీ ఆస్పత్రిలో టాయిలెట్ల దుస్థితి వర్ణనాతీతంగా తయారైంది. డెలివరీ వార్డు, ఎమర్జెన్సీ బ్లాక్, ఐసీయూ పరిసరాల్లో ఉన్న స్త్రీ, పురుషుల టాయిలెట్లకు కనీసం తలుపులు కూడా ఉండని దారుణ పరిస్థితి నెలకొంది. ఒకవేళ తలుపులు ఉన్నా వాటికి గొళ్ళేలు ఊడిపోయి దర్శనమిస్తున్నాయి. అసలే పూర్తిస్థాయిలో వైద్యులు, సిబ్బంది లేక ఇబ్బందులు పడుతున్న రోగులు, దుర్గంధం వెదజల్లుతున్న ఈ బాత్రూమ్‌లను చూసి మళ్ళీ ఆస్పత్రికి రావడానికే భయపడుతున్నారు. చిన్న పిల్లల నుండి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరూ టాయిలెట్లను ఉపయోగించాలంటే ముక్కు మూసుకుని నరకయాతన అనుభవించాల్సి వస్తోంది.

​”ఇదే టాయిలెట్లలోకి ప్రజాప్రతినిధులు, పెద్ద అధికారులు తమ కుటుంబ సభ్యులను పంపించగలరా.. పేదలంటే అంత అలుసా?” అని రోగులు, బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్వయంగా స్థానిక శాసనసభ్యుడు వైద్యుడై ఉన్నప్పటికీ ఆస్పత్రి((Bhadrachalam Hospital))లో కనీస పారిశుధ్య వసతులు మెరుగుపడకపోవడంపై స్థానికుల్లో తీవ్ర చర్చ నడుస్తోంది. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ఇతర ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి ఆస్పత్రి ప్రాంగణాన్ని, బాత్రూమ్స్ పరిశుభ్రంగా ఉంచేలా చర్యలు తీసుకోవాలన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న కాంట్రాక్టర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని పేషంట్లు, ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

Also Read : తిరుమలకు తీసిపోని తిరుమలయ్య గుట్ట..!

Follow Us On: X(Twitter)

ఖమ్మం వార్తల కోసం క్లిక్ చేయండి

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>