కలం, వెబ్డెస్క్: బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీశ్ రావులపై సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సంచలన ఆరోపణలు చేశారు. రక్తదానం క్యాంప్ నిర్వహించి బీఆర్ఎస్ కార్యకర్తల రక్తాన్ని వారు కోట్లాది రూపాయలకు అమ్ముకున్నారని ఆరోపించారు. హనుమకొండ జిల్లా పరకాలలో నిర్వహించిన బహిరంగ సభలో సీఎం రేవంత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ కుటుంబం, బంధువుల్లో ఎవరైనా తెలంగాణ కోసం త్యాగాలు చేశారా? అని ప్రశ్నించారు.
రాష్ట్ర యువత త్యాగాలు చేస్తే , ఆ పునాదుల మీద అధికారం దక్కించుకుందామని వారు ఆలోచిస్తున్నారని అన్నారు. మా రక్తం తీసుకోండి, కాళేశ్వరం, గోదావరి నీళ్లు మాకు ఇవ్వండి అంటూ ఇటీవల తెలంగాణ భవన్లో రక్తదాన కార్యక్రమం ఏర్పాటు చేశారని తెలిపారు. అయితే కేటీఆర్, హరీశ్ రావు రక్తదానం చేస్తారని అనుకున్నానని, కానీ, కేసీఆర్ కుటుంబంలో ఎవరూ రక్తదానం చేయలేదని సీఎం తెలిపారు.
అమాయకులైన వందలాది బీఆర్ఎస్ కార్యకర్తలు రక్తం ఇస్తే ప్రైవేట్ ఆస్పత్రుల్లో కోట్ల రూపాయలకు ఆ రక్తాన్ని అమ్ముకున్నారని చెప్పారు. గత పదేళ్లలో అధికారం అడ్డుపెట్టుకొని తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకున్నారని, ఇప్పుడు ప్రతిపక్షంలో కార్యకర్తల రక్తాన్ని అమ్ముకొని సంపాదించుకుంటున్నారని అన్నారు. కేసీఆర్ ఆరోగ్యం బాగా లేక రక్తం ఇవ్వలేదేమో అని సీఎం (CM Revanth Reddy) అన్నారు.
మరి కేటీఆర్, హరీశ్ రావు, సంతోష్ రావు, వినోద్ రావు ఎర్రబెల్లి దయాకర్ రావు ఎందుకు చుక్క రక్తం కూడా ఇవ్వలేదని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజల సొమ్ము వేల కోట్లు కొల్లగొట్టడం తప్ప వాళ్లు ప్రజలకు చేసిందేం లేదన్నారు. ఈ నేపథ్యంలో ప్రతిపక్షం రెచ్చగొట్టే వ్యాఖ్యలతో యువత ధర్నాలు, నిరసనలు అని సమయం వృథా చేసుకోవద్దని కేసుల బారిన పడవద్దని సూచించారు.
Also Read : పరకాల నియోజకవర్గానికి సీఎం అభివృద్ధి వరాలు
Follow Us On : WhatsApp

