కలం, వెబ్‌డెస్క్: టీమిండియా సెలక్షన్ కమిటీలో కీలక మార్పు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అజిత్ అగార్కర్ కాంట్రాక్ట్‌ను పొడిగించకూడదని బీసీసీఐ నిర్ణయించినట్లు సమాచారం. ఆయన స్థానంలో జహీర్ ఖాన్ (Zaheer Khan) పేరు ముందంజలో ఉంది. అగార్కర్ 2023 జులై 4న చీఫ్ సెలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు. సెప్టెంబర్‌లో ఆయన మూడేళ్ల పదవీకాలం పూర్తవుతుంది. నిబంధనల ప్రకారం మరో ఏడాది పొడిగింపుకు ఆయన అర్హుడే. అయినా కాంట్రాక్ట్ రెన్యూవల్ చేయకూడదని బీసీసీఐ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
శ్రీలంకతో భారత్ టెస్టు సిరీస్ ముగిసిన తర్వాత అగార్కర్‌తో బీసీసీఐ పెద్దలు సమావేశం కానున్నట్లు సమాచారం. ఆ సమావేశంలో ఆయన భవిష్యత్తుపై అధికారికంగా చర్చించే అవకాశం ఉంది. అగార్కర్ కాంట్రాక్ట్ పొడిగింపుపై నిర్ణయం వెనుక సెలక్షన్ కమిటీ, బీసీసీఐ మధ్య అభిప్రాయ భేదాలు ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా సీనియర్ ఆటగాళ్ల విషయంలో ఈ తేడాలు కనిపించాయని సమాచారం. ఇంగ్లాండ్ సిరీస్ తర్వాత రోహిత్ శర్మను జట్టు నుంచి తప్పించే అంశాన్ని సెలెక్టర్లు పరిశీలించినట్లు సమాచారం.
అయితే బీసీసీఐ మాత్రం రోహిత్ స్థానాన్ని మ్యాచ్‌ల వారీగా అంచనా వేయాలని భావించినట్లు తెలుస్తోంది. రోహిత్ భారత జట్టు ప్రణాళికల్లో ఉన్నంతకాలం కొనసాగుతారని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా గతంలో స్పష్టం చేశారు. ఈ అంశంలో బోర్డు, సెలెక్టర్ల మధ్య భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయనే విషయం బయటపడింది. అయితే అగార్కర్ కాంట్రాక్ట్‌ను ఎందుకు పొడిగించడం లేదనే దానిపై బీసీసీఐ అధికారిక కారణం వెల్లడించలేదు.
జహీర్ ఖాన్ పేరు ముందంజలో
అగార్కర్ స్థానానికి జహీర్ ఖాన్ పేరు బలంగా వినిపిస్తోంది. ఆయనతో బీసీసీఐ చర్చలు ఇప్పటికే జరుగుతున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. వీవీఎస్ లక్ష్మణ్‌ను డైరెక్టర్ ఆఫ్ క్రికెట్‌గా నియమించే పరిస్థితిలో జహీర్‌కు మరింత అవకాశం ఉంటుందని తెలుస్తోంది. చీఫ్ సెలెక్టర్ పదవికి లక్ష్మణ్ పేరు కూడా పరిశీలనలోకి వచ్చినా, ఎక్కువగా ప్రయాణాలు చేయాల్సి ఉండటంతో ఆయన ఆసక్తి చూపలేదని సమాచారం.
మరోవైపు హర్భజన్ సింగ్ కూడా చీఫ్ సెలెక్టర్ పదవిపై ఆసక్తిగా ఉన్నట్లు వార్తలు వచ్చాయి. పార్థివ్ పటేల్ పేరు కూడా మరో నివేదికలో ప్రముఖంగా వినిపించింది. అయితే కొత్త చీఫ్ సెలెక్టర్‌పై బీసీసీఐ ఇప్పటివరకు అధికారిక ప్రకటన చేయలేదు. తుది నిర్ణయం బోర్డు అధికారిక ప్రకటనతోనే స్పష్టమవుతుంది.

