లైక్స్, వ్యూస్ కోసం కక్కుర్తి.. చివరికి కటకటాల పాలు..!

కలం, ఖమ్మం బ్యూరో: సోషల్ మీడియాలో లైకులు, వ్యూస్ కోసం జనాలు ఎంతటి సాహసానికైనా ఒడిగడుతున్నారు. చివరికి అది చట్ట ప్రకారం నేరమని తెలిసినా రీల్స్ పిచ్చిలో కటకటాల పాలవుతున్నారు. ఉడుములను వేటాడి హింసిస్తూ వీడియోలు తీసి ఇన్స్టాగ్రామ్‌లో అప్‌లోడ్ చేసిన ఓ నెటిజన్‌ను అటవీ శాఖ అధికారులు అరెస్ట్ చేసిన సంఘటన భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లాలో వెలుగుచూసింది. ​

ఉలవనూరు ప్రాంతానికి చెందిన యాసా చంటి అనే వ్యక్తి కుక్కల సహాయంతో ఉడుములను దారుణంగా వేటాడుతూ, వాటిని హింసిస్తున్న దృశ్యాలను తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశాడు. వ్యూస్ కోసం పోస్ట్ చేసిన ఈ వీడియోలు కాస్త వైల్డ్‌లైఫ్‌ క్రైమ్‌ కంట్రోల్‌ బ్యూరో అధికారుల కంటపడ్డాయి.ఉడుములను వేటాడుతున్న దృశ్యాలను తీవ్రంగా పరిగణించిన బ్యూరో అధికారులు వెంటనే స్థానిక అటవీశాఖకు సమాచారం ఇచ్చారు. ​రంగంలోకి దిగిన అటవీ అధికారులు ఉలవనూరులో వేగంగా విచారణ చేపట్టి, వీడియోల ఆధారంగా నిందితుడు యాసా చంటి అని నిర్ధారించుకున్నారు.

దీంతో అతడిపై వన్యప్రాణి సంరక్షణ చట్టం- 1972 ప్రకారం కేసు నమోదు చేసి, న్యాయస్థానంలో హాజరుపరిచారు. ఈ విచారణ దర్యాప్తులో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ కవితా మాధురి, ఎఫ్‌ఎస్ఓ లు కృష్ణయ్య, సునీత, ఎఫ్‌బీఓ లు ఇరులాల్, వెంకట్రామ్‌లు పాల్గొన్నారు.​ మూగజీవాలను వేటాడినా లేదా వాటిని హింసించే దృశ్యాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ప్రచారం చేసినా చట్టపరంగా తీవ్ర పరిణామాలు ఉంటాయని, నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా అటవీశాఖ అధికారులు స్పష్టం చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>