కలం, వెబ్ డెస్క్ : తెలంగాణలో చలి (cold wave) రోజురోజకు పంజా విసురుతోంది. గత కొన్ని రోజులుగా ఉష్ణోగ్రతలు కనిష్టానికి చేరుకోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వృద్ధులు, చిన్నపిల్లలు ఉదయం, రాత్రి వేళల్లో వణికిపోతున్నారు. ప్రత్యేకంగా ఏజెన్సీ ప్రాంతాలతో పాటు అటవీ ప్రాంతాల్లో చలి తీవ్రత విపరీతంగా ఉంటోంది. కుమ్రంబీమ్ అసిఫాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 3 డిగ్రీల సెల్సియస్ కు పడిపోవడం ఆందోళన కలిగిస్తోంది.
అలాగే, పట్టణ ప్రాంతాల్లో కూడా చలి పులి విజృంభిస్తోంది. హైదరాబాద్ సహా పలు పట్టణాల్లో 7 నుంచి 13 డిగ్రీల మధ్య కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. శనివారం మెదక్ లో 7.9, సంగారెడ్డి లో 7.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కాగా, రానున్న రెండు రోజుల పాటు చలి తీవ్రత మరింత పెరిగి సూచనలు ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. ఈ రెండు రోజులు 2 నుంచి 3 డిగ్రీలు తగ్గే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.
ఉత్తర భారతం నుంచి వీస్తున్న పొడి గాలుల ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో శీతల గాలులు ఎక్కువగా వీస్తున్నాయి. దీంతో తెల్లవారు జామున పొగమంచు ఏర్పడి వాహనదారులకు ఇబ్బందులు కలిగిస్తోంది. ఈ కారణంగా రహదారులపై ప్రమాదాల ముప్పు ఏర్పడుతోంది. అలాగే, వాతావరణంలో మార్పుల కారణంగా ప్రజల ఆరోగ్యంపై ప్రభావం పడుతుందని వైద్యులు చెబుతున్నారు. జలుబు, దగ్గు, ఆస్తమా, గొంతు నొప్పి, ఫ్లూ జ్వరాలు వేగంగా వ్యాప్తి జరుగుతున్నాయి. ప్రధానంగా చిన్న పిల్లలు, వయసు మీద పడిన వారిపై ఈ ప్రభావం ఎక్కువగా ఉంటోంది.
ఉష్ణోగ్రతలు (Cold Wave) కనిష్టానికి పడిపోతున్నందున అవసరం అయితే తప్ప బయటకు వెళ్లకపోవడం మంచిదని సూచనలు చేస్తున్నారు డాక్టర్లు. ఒక వెళ్లాల్సి వస్తే స్వెట్టర్లు, గ్లౌజులు నిండుగా ధరించాలని చెబుతున్నారు. ఆహారం తీసుకోవడంలో కూడా జాగ్రత్తలు పాటించాలంటున్నారు. వేడి ఆహారం తీసుకోవడం, కాచిన నీటిని తాగాలని సూచిస్తున్నారు.
Read Also: అందుకు ఒప్పుకుంటేనే భారత్‌లో స్టార్‌లింక్ సేవలు!
Follow Us On: Youtube


