నిజామాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మహిళలు దుర్మరణం

కలం, నిజామాబాద్, బ్యూరో: తీర్థయాత్రకు బయలుదేరిన భక్తులకు ఆర్మూర్ (Armoor) మండల పరిధిలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. టైర్ పంక్చర్ కావడంతో జాతీయ రహదారిపై ఆగి ఉన్న టూరిస్ట్ బస్సును, వెనుక నుంచి వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టడంతో ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా కిన్వట్ ప్రాంతానికి చెందిన భక్తులు హైదరాబాద్‌లోని చిన్న జీయర్ స్వామి దర్శనం కోసం రెండు టూరిస్ట్ బస్సుల్లో తీర్థయాత్రకు బయలుదేరారు. ఆర్మూర్ మండల పరిధిలోని గోవింద్‌పేట్ బ్రిడ్జి సమీపానికి చేరుకున్న సమయంలో ముందుగా వెళ్తున్న టూరిస్ట్ బస్సు (TG 01 T 1864) టైర్ పంక్చర్ కావడంతో, రెండు (TG 21 T 2172) బస్సులను జాతీయ రహదారిపై నిలిపివేశారు.

దీంతో బస్సులోని కొంతమంది ప్రయాణికులు కిందికి దిగి రహదారి మధ్యలో ఉన్న డివైడర్‌పై కూర్చుని విశ్రాంతి తీసుకుంటున్నారు. ఇదే సమయంలో వేగంగా వచ్చిన లారీ (GT 27 TF 7482) ఆగి ఉన్న టూరిస్ట్ బస్సును బలంగా ఢీకొట్టింది. దీంతో టూరిస్ట్ బస్సు ముందుకు కదిలి, డివైడర్ దగ్గర కూర్చున్న ప్రయాణికులపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో సుజాత (54) , మాధవి (47) అనే ఇద్దరు మహిళలు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు ప్రయాణికులు సునీత, చిటక్కలు తీవ్రంగా గాయపడటంతో వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులకు వైద్యులు అత్యవసర చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీస్ కమిషనర్

ఘటన సమాచారం అందుకున్న నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాద పరిస్థితులను స్వయంగా పరిశీలించారు. ప్రమాదం జరిగిన తీరును సంబంధిత పోలీసు అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రమాదానికి దారితీసిన పరిస్థితులు, లారీ ఢీకొన్న తీరును అధికారులు కమిషనర్‌కు వివరించారు. సంఘటనా స్థలంలో సహాయక చర్యలు, ట్రాఫిక్ నియంత్రణ , క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించిన విధానం తదితర అంశాలను కమిషనర్ పరిశీలించారు. అనంతరం క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. వారి పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు.

తెలంగాణలో జాతీయ రహదారుల విస్తరణ పనులు పూర్తిస్థాయిలో జరగకపోవడంతో తరచుగా ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా ఇరుకైన రహదారులు, ప్రమాదకర మలుపులు, సరైన లైటింగ్‌ లేకపోవడం, రహదారి పక్కన వాహనాలను నిలిపివేయడం లాంటి కారణాలు ప్రమాదాలకు కారణమవుతున్నాయి. జాతీయ రహదారులను విస్తరించి, అవసరమైన చోట సర్వీస్‌ రోడ్లు, హెచ్చరిక బోర్డులు, ప్రమాదకర ప్రాంతాలను గుర్తించి భద్రతా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Also Read : ఫిరాయింపు ఎమ్మెల్యేల్లో అసంతృప్తి మంటలు

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>