కలం, వెబ్ డెస్క్ : బంగ్లాదేశ్‌లో(Bangladesh) మైనారిటీలైన హిందువులపై జరుగుతున్న దాడులను ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ (Asaduddin Owaisi) తీవ్రంగా ఖండించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బంగ్లాదేశ్‌లో దీపు చంద్ర దాస్, అమృత్ మండల్ అనే ఇద్దరు వ్యక్తులు హత్యకు గురైన ఘటనలను తమ పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తోందని తెలిపారు. బంగ్లాదేశ్‌లో శాంతిభద్రతల పరిరక్షణకు భారత ప్రభుత్వం తీసుకుంటున్న ప్రతి చర్యకు తాము మద్దతు ఇస్తామని ఆయన స్పష్టం చేశారు.
బంగ్లాదేశ్ ఒకప్పుడు లౌకికవాద ప్రాతిపదికన ఏర్పడిందని, అక్కడ నివసిస్తున్న 2 కోట్ల మంది ముస్లిమేతర మైనారిటీలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత అక్కడి ప్రభుత్వంపై ఉందని ఒవైసీ పేర్కొన్నారు. ‘బంగ్లాదేశ్‌లో జరుగుతున్న హింసాత్మక ఘటనలు ఆ దేశ రాజ్యాంగ స్ఫూర్తికే విరుద్ధం. మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని ప్రభుత్వం మైనారిటీలందరికీ భద్రత కల్పించాలని మేము కోరుతున్నాం’ అని ఆయన అన్నారు.
బంగ్లాదేశ్‌లో స్థిరత్వం ఉండటం భారతదేశ భద్రతకు, ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాల ప్రయోజనాలకు అత్యంత కీలకమని అసదుద్దీన్ ఒవైసీ (Asaduddin Owaisi) అభిప్రాయపడ్డారు. ఐఎస్ఐ (ISI), చైనా వంటి శక్తులు అక్కడ చురుగ్గా ఉన్నాయని, ఈ నేపథ్యంలో వచ్చే ఫిబ్రవరిలో జరగబోయే ఎన్నికల తర్వాత రెండు దేశాల సంబంధాలు మెరుగుపడతాయని ఆశిస్తున్నట్లు ఆయన తెలిపారు. బంగ్లాదేశ్ అంశంతో పాటు, భారతదేశంలో ఇటీవల జరిగిన కొన్ని హింసాత్మక ఘటనలను ఒవైసీ ఎత్తి చూపారు. పొరుగు దేశం గురించి మాట్లాడుతున్నప్పుడు మన దేశంలో జరుగుతున్న అరాచకాలను మర్చిపోకూడదని ఆయన వ్యాఖ్యానించారు.
డిసెంబర్ 24న ఒడిశాలోని సంబల్‌పూర్‌లో పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఒక కార్మికుడిని మూకదాడిలో చంపేశారని ఆయన గుర్తుచేశారు. ఉత్తరాఖండ్‌లో ఎంబీఏ చదువుతున్న ‘ఏంజెల్ చక్మా’ అనే గిరిజన యువకుడిపై దాడి జరిగిందని, ఆ గాయాలతోనే అతను మరణించాడని ఆవేదన వ్యక్తం చేశారు. ‘చట్టబద్ధమైన పాలన కుప్పకూలి, మెజారిటీ రాజకీయాలు పెచ్చుమీరినప్పుడు ఇలాంటి మూకదాడులు జరుగుతాయి. ఇవి ఏ దేశంలో జరిగినా ఖండించాల్సిందే’ అని ఒవైసీ పేర్కొన్నారు. మైనారిటీలపై ఎక్కడ దాడి జరిగినా అది ఆ దేశ ప్రతిష్టకే భంగమని ఆయన స్పష్టం చేశారు.
Read Also: అమెరికాలో తెలుగు వ్యక్తి స్టార్టప్‌కు బెదిరింపులు
Follow Us On: Instagram


